రాష్ట్రంలో పర్యాటకం కొత్త పుంతలు తొక్కుతోంది. జలాశయాలు, జలపాతాల అందాల్ని పర్యాటకులు వీక్షిస్తూ సరికొత్త అనుభూతుల్ని పొందుతున్నారు. కొండలు, గుట్టలు ఎక్కడమే కాదు.. వందల అడుగుల ఎత్తుల్లోంచి జలపాతంతో పోటీపడుతూ కిందకు జారుతున్నారు. భారీ జలాశయాల్లో విన్యాసాలు చేస్తున్నారు. పడవలో పయనిస్తూ ముందుకు సాగుతున్నారు. వారాంతాలు, సెలవు రోజుల్లో యువకులు, పిల్లలు, పెద్దలతో పర్యాటక ప్రాంతాలు సందడిగా మారుతున్నాయి. లక్నవరం చెరువు, కుంటాల, గాయత్రి, బాబేజారి, మిట్టె, ముత్యంధార జలపాతాలు, పాండవులగుట్ట సాహస కృత్యాలకు నెలవులుగా మారుతూ.. యువతను ఆకర్షిస్తున్నాయి. ఆయా ప్రాంతాల్లో ఎలాంటి సాహస క్రీడలు అందుబాటులో ఉన్నాయి. వసతి, భోజనం తదితర సదుపాయాల పరిస్థితి ఏమిటి? తదితరాలపై పూర్తి కథనం.
విదేశాల్లో, దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలకే పరిమితమైన అడ్వెంచర్ టూరిజం రాష్ట్రంలోనూ పెరుగుతోంది. వివిధ సౌకర్యాలు, క్రీడలకు ఏర్పాట్లు కల్పించడంతో లక్నవరం చెరువు, కుంటాల, గాయత్రి, బాబేజారి, మిట్టె, ముత్యంధార జలపాతాలు, పాండవులగుట్టకు కొంతకాలంగా అడ్వెంచర్ టూరిస్టులు పెద్ద ఎత్తున వస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో వసతి, భోజనం తదితర సదుపాయాలు మెరుగుపరిస్తే పర్యాటకం మరింత ఊపందుకునే అవకాశం ఉంటుంది.
జలపాత హోరు.. పర్యాటక ఊపు..
కొండలపై నుంచి దూకుతున్న జలధారల్లో తడుస్తూ తాడు సాయంతో కిందికి చేరడమే వాటర్‌ఫాల్ రాప్లింగ్. విదేశాల్లో అడ్వెంచర్ టూరిజంలో సాహసాలు చేసేవారికి స్థానికంగా అడ్వెంచర్ సంస్థలు ఈ పోటీలు నిర్వహిస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం గుండివాగు గ్రామ సమీపంలో 330 అడుగుల ఎత్తయిన గాయత్రి జలపాతంలో వాటర్ రాప్లింగ్ పోటీలు జరగబోతున్నాయి. వేగంగా కిందికి దిగేవారు ఇందులో విజేతలు.
700 అడుగుల ఎత్తులోంచి..
ములుగు జిల్లా ముత్యంధార.. 700 అడుగుల ఎత్తులోంచి జలధారలు పడుతూ పర్యాటకుల్ని విశేషంగా ఆకర్షిస్తుంది. కొంతకాలంగా ఈ జలపాతానికి వెళ్లే పర్యాటకుల సంఖ్య బాగా పెరుగుతోంది. ఇక్కడా వాటర్‌ఫాల్ రాప్లింగ్ నిర్వహణకు ప్రయత్నాలు జరిగాయి.