తెలంగాణ

telangana

ETV Bharat / city

TSLPRB Excise Recruitment : పోలీస్‌ చేతికి ఎక్సైజ్‌ నియామకాలు - TSLPRB Excise Recruitment

TSLPRB Recruitment : రాష్ట్ర పోలీస్ నియామక మండలికి మరో అదనపు బాధ్యతను అప్పగించేందురు సర్కార్ యోచిస్తోంది. పోలీసు నియామకాలతో పాటు కొత్తగా ఎక్సైజ్, రవాణా శాఖ సిబ్బందిని నియమించే బాధ్యతను అప్పగించేందుకు రంగం సిద్ధమైంది.

TSLPRB Excise Recruitment
TSLPRB Excise Recruitment

By

Published : Apr 9, 2022, 7:54 AM IST

రాష్ట్ర పోలీస్‌ నియామక మండలి(టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) పరిధి మరింత విస్తృతం కానుంది. పోలీస్‌ సిబ్బంది నియామకాలతో పాటుగా కొత్తగా ఎక్సైజ్‌, రవాణా శాఖ సిబ్బంది నియామక బాధ్యతలనూ ఈసారి మండలికి అప్పగించేందుకు రంగం సిద్ధమైంది. ఈ విషయంలో ప్రభుత్వం ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయానికి వచ్చింది. ఇప్పటి వరకు ఎక్సైజ్‌ సిబ్బంది నియామకాలను ఆ శాఖ, రవాణా శాఖ సిబ్బంది నియామకాలు టీఎస్‌పీఎస్‌సీ ఆధ్వర్యంలో జరిగేవి. మండలి ఆధ్వర్యంలో జరిగే నియామక ప్రక్రియ పకడ్బందీగా ఉండటానికితోడు ఎక్సైజ్‌, రవాణా శాఖలోనూ యూనిఫాం సర్వీసెస్‌కే చెందిన సిబ్బందిని నియమించాల్సి ఉన్నందున టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మూడు శాఖల్లోనూ కానిస్టేబుళ్ల నియామకాలే అత్యధికం కావడంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా కనిపిస్తోంది. కానిస్టేబుళ్ల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయడంలో దేహదారుఢ్య పరీక్షల నిర్వహణే కీలకం. ఇందులో కీలకమైన పరుగు పందెంలో పాల్గొనే అభ్యర్థులకు రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌(ఆర్‌ఎఫ్‌ఐడీ) ట్యాగ్‌లను అమర్చడం ద్వారా అక్రమాలను నియంత్రిస్తున్నారు. దేశంలోనే ఈ తరహాలో నియామకాల ప్రక్రియ అరుదు కావడం గమనార్హం. నియామకాల్లో ఇలా పారదర్శకతకు పెద్దపీట వేయడంతో 2018లో ఎలాంటి ఆరోపణలు లేకుండా సజావుగా ప్రక్రియను పూర్తి చేయగలిగారు. ఈ క్రమంలోనే టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ చేతికే ఎక్సైజ్‌, రవాణా శాఖ సిబ్బంది నియామక ప్రక్రియను అప్పగించాలని నిర్ణయించారు.

నోటిఫికేషన్లు రావడమే ఆలస్యం :రాష్ట్రంలో 80 వేల ఉద్యోగాల భర్తీలో భాగంగా తొలివిడతగా దాదాపు 30వేల ఉద్యోగాలకు ఆర్థికశాఖ ఆమోదముద్ర వేసింది. వీటిలో 17,000 పోలీస్‌, 212 రవాణా పోస్టులుండటంతో మండలి ఇప్పటికే ప్రాథమిక కసరత్తు చేపట్టింది. ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడటమే ఆలస్యం నియామక ప్రక్రియను ప్రారంభించేందుకు సన్నద్ధంగా ఉంది. తొలుత ప్రాథమిక రాతపరీక్ష నిర్వహించాల్సి ఉండటంతో ఇందుకోసం ప్రణాళిక రూపొందించే పనిలో నిమగ్నమైంది. అలాగే దేహదారుఢ్య పరీక్షల నిర్వహణకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సీటీసీ, పీటీసీ, డీటీసీ, బెటాలియన్లలోని మైదానాలను సిద్ధం చేస్తోంది.

ABOUT THE AUTHOR

...view details