తెలంగాణ

telangana

ETV Bharat / city

ఇద్దరు మంత్రులు.. ఒక్కొక్కరికి 3 ఆఫీసులు..

Public money wastage in AP: ప్రజాధనాన్ని వృథా చేయటంలో ఏపీలో కొందరు రాష్ట్ర మంత్రులు ప్రత్యేకంగా వ్యవహరిస్తున్నారు. సచివాలయంలో ఆఫీస్ ఉన్నా ప్రత్యేకంగా కార్యాలయాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇద్దరు మంత్రులకు మాత్రం ఏకంగా మూడేసి కార్యాలయాలు ఉన్నాయి. మంత్రులు విడదల రజిని, గుడివాడ అమర్నాథ్‌కు సచివాలయంలోనే కాకుండా క్యాంపు ఆఫీసులో ఒకటి, ఏపీఐఐసీ భవనంలో ఇంకోటి.. మొత్తం మూడు ఆఫీసులు ఉన్నాయి.

Public money
Public money

By

Published : Oct 6, 2022, 9:28 AM IST

Public money wastage in AP: రాష్ట్ర సచివాలయం అంటేనే సచివులు కొలువుదీరి పాలన అందించే ప్రాంతం. అమరావతిలోని సచివాలయం మాత్రం దీనికి భిన్నంగానే ఉంటోంది. వందల కోట్ల రూపాయల వ్యయంతో భవనాలు కట్టి మంత్రుల ఛాంబర్లు, కార్యదర్శుల కార్యాలయాలు, సిబ్బందికి వీలుగా ఏర్పాట్లు చేసినా .. సచివాలయంలో విధులు నిర్వహించే మంత్రుల సంఖ్య అంతంత మాత్రమే. కేబినెట్​లోని ఇద్దరు మంత్రులది మాత్రం ప్రత్యేకమైన బాట.

వీరికి సచివాలయంతో పాటు క్యాంపు కార్యాలయాలు ఉన్నా.. అదనంగా మంగళగిరి ఏపీఐఐసీ భవనంలోనూ కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నారు. దీనికి ప్రత్యేకంగా ఎలాంటి అనుమతీ లేకపోయినా లక్షల రూపాయల వ్యయంతో ఈ ఛాంబర్లను ప్రతీ నెలా నిర్వహించాల్సి వస్తోంది. వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజిని, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రత్యేకంగా ఏపీఐఐసీ భవనంలో నిబంధనలకు విరుద్ధంగానే కార్యాలయాలను ఏర్పాటు చేసుకున్నారు. ఆయా శాఖలే ఈ కార్యాలయాల కోసం అదనపు వ్యయాన్ని భరిస్తున్నాయి.
వాస్తవానికి ఈ ఇద్దరు మంత్రులకు సచివాలయంలోనే విశాలమైన ఛాంబర్లు ఉన్నాయి. వాటిని లక్షల రూపాయల వ్యయంతో ఆయా శాఖలే మంత్రుల వ్యక్తిగత అభిరుచులకు తగ్గట్టుగా ఆధునీకరించాయి కూడా. అయినప్పటికీ ముఖ్యమంత్రి సచివాలయానికి రాకపోవటంతో వారూ సచివాలయానికి రాకుండా ప్రత్యేక కార్యాలయాలను ఏర్పాటు చేసుకున్నారు. ఈ ఇద్దరు మంత్రులకూ తమ తమ నివాసాల వద్ద క్యాంపు కార్యాలయం ఉన్నప్పటికీ.. దానికి అదనంగా ఈ కార్యాలయాలు ఏర్పాటు అయ్యాయి. దీనికోసం సిబ్బందిని, అదనపు వ్యయాన్ని ఖజానా నుంచి భరించాల్సి వస్తోంది.

ఏపీ సచివాలయంలో మంత్రుల హాజరు తక్కువగా ఉంటోంది. కేబినెట్ సమావేశం, అసెంబ్లీ సమావేశాలు మినహా మంత్రులంతా ఒకే దఫా హాజరు అవుతున్న సందర్భాలు ఒక్కటి కూడా నమోదు కావడం లేదు. నలుగురైదుగురు మంత్రులు మినహా సచివాలయంలోని తమ ఛాంబర్లలో విధులు నిర్వహిస్తున్న వారి సంఖ్య చాలా తక్కువే. మంత్రులు, కార్యదర్శులు క్యాంపు కార్యాలయాలకు, హెచ్ఓడీ కార్యాలయాలకు మాత్రమే పరిమితం అవుతుండటం వల్ల సచివాలయంలో ఉద్యోగుల హాజరూ తక్కువగానే నమోదు అవుతోంది. ముఖ్యమంత్రి జగన్ దీనిపై ఇప్పటికే స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చినా వాటిని అమలు చేస్తున్న పరిస్థితి ఉండటం లేదు. మంత్రులతో పాటు కార్యదర్శులంతా తప్పనిసరిగా హాజరు కావాల్సిందేనని పదేపదే సర్క్యులర్ లు జారీ చేస్తున్నా సీఎస్ మాట కూడా లెక్కచేయని పరిస్థితి నెలకొంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details