అశ్లీల చిత్రాల దందా కేసులో అరెస్ట్ అయిన పారిశ్రామికవేత్త రాజ్‌కుంద్రా భార్య, నటి శిల్పాశెట్టి భావోద్వేగానికి గురైంది. తన కుటుంబ గోప్యతను గౌరవించాలని, నిజనిజాలేంటో ధ్రువీకరించకుండా సగం సగం సమాచారంపై వ్యాఖ్యానించడం మానుకోవాలని అభ్యర్థించింది. మీడియా తమ కేసుపై విచారణ చేపట్టాల్సిన అవసరం లేదని పేర్కొంది.
"గత కొన్ని రోజులుగా సవాళ్లు కొనసాగుతున్నాయి. చాలా పుకార్లు, ఆరోపణలు వస్తున్నాయి. మీడియా, శ్రేయోభిలాషులు కూడా మాపై ఎన్నో నెగటివ్ కామెంట్లు చేశారు. దయచేసి తప్పుడు ఆరోపణలు చేయొద్దు. ప్రస్తుతం ఈ కేసుపై దర్యప్తు కొనసాగుతోంది. ముంబయి పోలీసులు, భారతీయ న్యాయవ్యవస్థపై పూర్తి నమ్మకం ఉంది. ఓ భారతీయ పౌరురాలిగా మన చట్టంపై నాకు గౌరవం ఉంది. 29ఏళ్లుగా సినీ రంగంలో ఉన్నాను. కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నాను. ప్రజలు నాపై విశ్వాసం ఉంచారు. నేను ఎవరినీ నిరాశపర్చలేదు. కాబట్టి ఈ కాలంలో నా పిల్లలు, కుటుంబ గోప్యతను గౌరవించాలని కోరుతున్నా. మేం మీడియా విచారణకు అర్హులం కాదు. చట్టం తన పనిన తాను చేసుకుపోతుంది. సత్యమేవ జయతే"