Actress Samantha : ఎవరి జీవితం అద్భుతంగా ఉండదని.. తన జీవితంలోనూ ఎన్నో రకాల మానసిక ఇబ్బందులు తలెత్తినట్లు సినీ నటి సమంత చెప్పారు. అలాంటి సమస్యలు ఎదురైనప్పుడు స్నేహితులు, కుటుంబ సభ్యులు, వైద్యుల సాయం తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్‌లో 'రోష్ని ట్రస్ట్' ఏర్పాటు చేసిన 'సైకియాట్రి ఎట్ యువర్ డోర్ స్టెప్' కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు.
Samantha About Mental Health : శరీరానికి దెబ్బ తగిలితే వైద్యులను కలిసినట్లుగానే మనసుకి గాయం అయినప్పుడు కూడా డాక్టర్లను సంప్రదించాలని సమంత సూచించారు. స్నేహితులు, కుటుంబ సభ్యులు, వైద్యుల మద్దతుతోనే ఇవాళ ధైర్యంగా నిలబడినట్టు వివరించారు. ప్రతి మానసిక సమస్యకు వైద్యుల వద్దకే వెళ్లాల్సిన అవసరం లేదని, సరైన కౌన్సెలర్ ఉంటే సమస్య తేలిగ్గా సమసిపోతుందని చెప్పారు.
Samantha on Depression : ఈ తరహా సమస్యలతో బాధపడుతున్న వారికి మనోధైర్యం కల్పించేందుకు రోష్ని ట్రస్ట్ ‘సైకియాట్రి ఎట్ డోర్ స్టెప్’ కార్యక్రమాన్ని ప్రారంభించడం హర్షించదగిన విషయమన్నారు. ఇందుకోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనాన్ని సమంత ప్రారంభించారు. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్, రోష్ని ట్రస్ట్ ప్రచారకర్త శిల్పారెడ్డి, దాట్ల ఫౌండేషన్, రోష్ని ట్రస్ట్ సభ్యులు మహిమ దాట్ల, త్రిషానియా రాజు, డా.శ్రీలక్ష్మి, శశి, రంజన, శశిరెడ్డి, పూనం పమ్నాని పాల్గొన్నారు.