తన ప్రతిష్ఠకు భంగం కలిగించేలా దుష్ప్రచారం చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న సినీ నటి సమంత... పిటిషన్‌పై విచారణ సోమవారానికి వాయిదా పడింది (Samantha Defamation Suit updates). సమంత పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కూకట్‌పల్లి కోర్టు... నోటీసులు ఇవ్వకుండా నేరుగా పిటిషన్‌ను వేయవచ్చన్న న్యాయవాది బాలాజీ వాదనతో ఏకీభవించింది. వైద్యుడు సీఎల్వెంకట్రావుతో పాటు రెండు యూట్యూబ్ ఛానళ్లపై... నటి సమంత పరువునష్టం దావా దాఖలు చేశారు. పరువు నష్టం కలిగించేలా ఇక నుంచి మాట్లాడకుండా నిరోధించాలన్న సమంత అభ్యర్థనపై విచారణను కోర్టు ఈ నెల 25కు వాయిదా వేసింది.
ఇదీ జరిగింది..
సామాజిక మాధ్యమాల్లో ప్రచారంపై నటి సమంత (Samantha Defamation Suit) కోర్టుకెక్కారు. హైదరాబాద్ కూకట్‌పల్లి కోర్టు(Kukarpally Court)లో పరువునష్టం కేసు (Samantha Defamation Suit) నమోదు చేశారు. తనపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ వైద్యుడు, విశ్లేషకుడు డాక్టర్ సీఎల్ వెంకట్రావుతో పాటు మరో మూడు యూట్యూబ్ ఛానెళ్లపై నటి సమంత కూకట్‌పల్లి కోర్టులో పరువునష్టం దావా (Samantha Defamation Suit) దాఖలు చేశారు. అక్కినేని నాగచైతన్యతో తన వైవాహిక జీవితంపై సుమన్ టీవీ, తెలుగు పాపులర్ టీవీ, టాప్ తెలుగు టీవీ యూట్యూబ్ ఛానెళ్లలో వెంకట్రావు తప్పుడు ప్రచారం చేశారని పిటిషన్లో సమంత పేర్కొన్నారు. తన వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించేలా అబద్ధపు వ్యాఖ్యలు చేశారన్నారు.
మీడియా, పత్రికల ద్వారా బేషరతుగా బహిరంగ క్షమాపణలు చెప్పేలా ఆదేశించాలని కోర్టును సమంత కోరారు. మరిన్ని వివరాలు సేకరిస్తున్నానని... పరువునష్టం ఎంతనేది తర్వాత కోరతానన్నారు. ఇక నుంచి తనపై దుష్ప్రచారం చేయకుండా మధ్యంతర ఆదేశాలు ఇవ్వాలని సమంత కోరారు.
పిటిషన్ రిటర్న్...
పరువు నష్టం దావా (Samantha Defamation Suit) కేసులో ప్రతివాదులకు నోటీసులు పంపించని కారణంగా పిటిషన్‌ను కూకట్‌పల్లి కోర్టు రిటర్న్ (Petition Return) చేసింది. ప్రతివాదులకు నోటీసులు పంపించకుండా కేసు ఫైల్ చేయవచ్చని సమంత తరఫు అడ్వొకేట్ బాలాజీ వాదనలు వినిపించారు.
ఇటీవలే విడిపోయిన చై-సామ్..
తెలుగు చలన చిత్రపరిశ్రమలో ప్రేమించి పెళ్లి చేసుకున్న అక్కినేని నాగచైతన్య, సమంతలు తమ బంధానికి ముగింపు పలికారు. భార్యభర్తలుగా విడిపోతున్నట్లు సామాజిక మాద్యమాల ద్వారా అధికారికంగా ప్రకటించారు. పదేళ్లుగా తమ స్నేహం కొనసాగినందుకు అదృష్టవంతులమని పేర్కొన్న చైతన్య, సమంత.. ఆ స్నేహమే తమ వివాహ బంధానికి కీలకంగా నిలిచిందన్నారు. అయితే విడిపోడానికి సరైన కారణాన్ని వెల్లడించని వీరిద్దరూ.. ఈ క్లిష్ట పరిస్థితుల్లో తమ వ్యక్తిగత స్వేచ్ఛకు అభిమానులు, శ్రేయోభిలాషులు, మీడియా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్లో తమ స్నేహ బంధం కొనసాగుతుందని తెలిపారు.
2010లో గౌతమ్ మేనన్ దర్శకత్వంలో వచ్చిన 'ఏం మాయ చేశావే' చిత్రంతో మొదలైన వీరిద్దరి పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. 2017లో అక్టోబర్ 6, 7 తేదీల్లో గోవాలో హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల ప్రకారం వైభవంగా పెళ్లి చేసుకున్నారు. ఇరు కుటుంబాలు ఎంతో వైభవంగా పెళ్లి జరిపించారు. పెళ్లికి ముందు ఆటో నగర్ సూర్య, మనం చిత్రాల్లో కలిసిన నటించిన సామ్ -చైతన్య.. పెళ్లి తర్వాత మజిలి చిత్రంలో భార్యభర్తలుగా నటించారు. ఆ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని అందుకొని నిజమైన భార్యభర్తల అనుబంధానికి అద్దం పట్టింది. 2020 వరకు ఎంతో అన్యోన్యంగా సాగిన వీరి వివాహ బంధం లాక్ డౌన్ కు ముందు అనూహ్య మలుపు తిరిగింది.
అక్కడే మొదలైంది!
ట్విట్టర్ ఖాతాలో సమంత తన పేరు పక్కనున్న అక్కినేని ఇంటిపేరును తొలగించి ఎస్ అక్షరం మాత్రమే ఉంచడం వల్ల సామాజిక మాధ్యమాల్లో చర్చ మొదలైంది. కానీ ఇద్దరిలో ఎవరూ ఆ వార్తలను ఖండించలేదు. ఆ తర్వాత నుంచి సమంత చైతూకు దూరంగా ఉండటం, ఒంటరిగానే తిరుమల దర్శనానికి వెళ్లిరావడం, ఇటీవల చైతూ నటించిన 'లవ్ స్టోరీ' విడుదల ప్రచారంలో సమంత ఊసే ఎత్తకపోవడం వల్ల వివాహ బంధానికి ముగింపు పలకబోతున్నారన్న ప్రచారానికి బలం చేకూర్చాయి.
అదే కారణమా?
'సూపర్ డీలక్స్' చిత్రంతో పాటు 'ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్ లో సమంత తన పరిధికి మించి నటించడం చైతూకు నచ్చలేదనే ప్రచారం జరిగింది. ఈ విషయంలోనే ఇద్దరి మధ్య గొడవలు జరిగాయని తెలుస్తోంది. అలా చిలికి చిలికి గాలి వానలా మారిన గొడవలు.. విడాకుల వరకు దారి తీసినట్లు సమాచారం. ప్రస్తుతం సమంత గుణశేఖర్ దర్శకత్వంలో 'శాకుంతలం' చిత్రంలో నటించగా.. చైతన్య తన తండ్రితో కలిసి 'బంగార్రాజు' చిత్రంలో నటిస్తున్నాడు.
ఇదీ చూడండి:సమంత పరువునష్టం పిటిషన్‌పై తీర్పు నేడే..!