'వదల బొమ్మాళి' అంటూ దాదాపు పుష్కరం క్రితం ప్రేక్షకులను భయపెట్టిన సోనూసూద్... తెలుగువారందరికీ సుపరిచితమే. విలనీని ప్రదర్శించడంలో అతనిదో సెపరేట్ స్టైల్. ఆరడుగుల ఎత్తు, ఆరుపలకల దేహంతో హీరోకి ఏమాత్రం తీసిపోనట్టు ఉండే సోనూసూద్... దక్షిణాది, ఉత్తరాది చిత్రపరిశ్రమల్లో గత కొన్నేళ్లుగా డిమాండ్ ఉన్న నటుడే. తెరపై అతను విలనైనా.... కరోనా తీసుకొచ్చిన కష్టం... అతనిలోని మంచిమనసును అందరికీ పరిచయం చేసింది. పొట్ట చేతబట్టుకుని ఉపాధి కోసం తరలివచ్చిన వలసకూలీల వెతలు అతణ్ని కదిలించింది. చంటిబిడ్డలను చంకన పెట్టుకుని వేల కిలోమీటర్లు నడుస్తున్న వారందరికీ నేనున్నానంటూ ముందుకొచ్చాడు. తనను ఆదరించి ఇంతటి వాడిని చేసిన ప్రజలకు ఏదైనా చేయాలన్న సత్సంకల్పమే అతణ్ని ఇప్పుడు జాతీయస్థాయిలో సూపర్‌స్టార్‌గా నిలిపింది. సోనూలో రగులుతున్న అంతర్మథనమే అతణ్ని ఈ దిశగా నడిపింది.
మూలాలు మర్చిపోకూడదు
మనం ఎంత ఎత్తుకు ఎదిగినా... మూలాలను మర్చిపోకూడదు అంటుంటారు. సోనూ అదే పాటించాడు. 23ఏళ్ల క్రితం ఉపాధి కోసం మహారాష్ట్రకు రాక... సినీ అవకాశాల కోసం చక్కర్లు.... రైల్లో బాత్రూం పక్కన నిద్రిస్తూ చేసిన ప్రయాణాలు... ఇలా ప్రతిదీ తనకు గుర్తే. 1997 నాటి రైల్వే పాస్‌ను సైతం ఇప్పటికీ భద్రంగా దాచుకున్నాడు. శ్రమ, ప్రతిభకు అదృష్టం తోడై సినిమాల్లో మంచిపేరు సంపాదించాడు. కరోనా కష్టకాలంలో సమాజానికి తిరిగి ఏదైనా చేయాలన్న ఉద్దేశంతో తొలుత... ముంబయిలోని అంథేరీ, జుహు ప్రాంతాల్లోని కూలీలకు ఆహారమందించాడు. స్వస్థలాలకు కాలిబాటన వెళ్తున్న వారి కష్టాలు చూసి.... అందరినీ ఇళ్లకు చేర్చే బాధ్యతను భుజానికెత్తుకున్నాడు. మహారాష్ట్రలో చిక్కుకున్న వారిని తరలించేందుకు అధికారుల నుంచి అనుమతులు తీసుకుని ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశాడు. ఇళ్లకు వెళ్తున్నామన్న వారి చిరునవ్వు అతనికి ఎనలేని సంతృప్తినిచ్చింది. ముంబైలో సోనూసూద్ చేస్తున్న ఈ సాయం... సామాజిక మాధ్యమాల ద్వారా దేశమంతటా విస్తరించింది. ఎన్నో రాష్ట్రాల్లో ఇరుకున్న వేల మంది నుంచి అతనికి వినతుల రాక ప్రారంభమైంది..