తెలంగాణ

telangana

ETV Bharat / city

కల కోసం కళకు బ్రేక్.. అతని 'టికిల్ ట్రక్'​కు భలే క్రేజ్ - చెన్నైలో నటుడు భరత్ జయంత్ ఐస్ క్రీమ్ ట్రక్

అందరిలానే.. ఆ కుర్రాడికి ఐస్‌క్రీమ్‌లు అంటే ఇష్టం. అయితే వాటిని ఆస్వాదిస్తునే ఉండిపోకుండా... ఆ ఇష్టాన్నే వ్యాపారంగా మలచాలనుకున్నాడు. కార్టూన్‌ ఛానళ్లలో కనిపించే రంగురంగుల ఐస్‌క్రీమ్‌ ట్రక్‌లు ఏర్పాటు చేయాలనుకున్నాడు. కానీ, అనుకోకుండా సినిమా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. వెండితెరపై, బుల్లితెరపై నటుడిగా బిజీబిజీగా మారి పోయాడు. అయితేనేం... చిన్నప్పటి కల కోసం కొన్నాళ్ల పాటు నటనకు బ్రేక్‌ ఇచ్చాడు. సముద్రతీరాన సరికొత్త జీవితాన్ని ఆస్వాదిస్తున్న ఆ కుర్రాడే... భరత్‌ జయంత్‌.

the tickle truck ice cream
కల కోసం కళకు బ్రేక్

By

Published : Mar 15, 2021, 11:44 AM IST

Updated : Mar 15, 2021, 11:58 AM IST

చెన్నై బీసెంట్‌నగర్‌ బీచ్‌కి వెళితే అక్కడ ఓ ట్రక్‌ కనిపిస్తోంది. దాని పేరు... ది టికిల్‌ ట్రక్‌. రంగురంగుల చిత్రాలతో ఆకట్టుకుంటున్న ఈ వాహనంలో... నోరూరించే ఐస్‌క్రీమ్‌లు ఉంటాయి. ఒక్కసారి తింటే... మళ్లీ మళ్లీ తినాలనిపించేంతగా మైమరిపిస్తాయి. ఐస్‌క్రీమ్స్‌తో పాటు ఆ బండికి మరో ప్రత్యేక ఆకర్షణ ఉంది. ఆ ట్రక్‌ యజమాని తమిళ నటుడు భరత్‌ జయంత్‌ మరీ.

కల కోసం కళకు బ్రేక్

చిన్నప్పుడు అందరిలానే భరత్‌కు ఐస్‌క్రీమ్‌ అంటే ఎంతో ఇష్టం. కార్టూన్‌ ఛానళ్లలో వచ్చే రకరకాల ఐస్‌క్రీమ్‌ ట్రక్‌లు చూసి... ఎప్పటికైనా అలా ఓ ట్రక్‌ ఏర్పాటు చేయాలని భావించేవాడు. ఐస్‌క్రీమ్‌ బండి నడపాలనే కోరిక ఉన్నా.. వాటి తయారీలో అతడికి ఎలాంటి అనుభవం లేదు. అలా ‘టికిల్‌ ట్రక్‌’ ప్రారంభించేనాటికి అతడో నటుడు. 30కి పైగా సినిమాలు, సీరియల్స్‌ చేశాడు .

నటుడిగా బిజీగా ఉన్నా కొన్నాళ్లు నటనకు విరామం ఇచ్చి... మరి వ్యాపారంలోకి అడుగు పెట్టాడు భరత్. తన ఆలోచనను మిత్రులతో పంచుకోవటం.. వారు కూడా అంగీకరించడంతో.. ఆ దిశగా ముందడుగు వేశాడు. అప్పటికి వారిలో ఎవరికీ ఐస్‌క్రీమ్‌ తయారీలో అనుభవం లేదు. ఐనా యూట్యూబ్‌లో వెతుకుతూ కొత్త రుచుల్ని చెన్నైవాసులకు పరిచయం చేయాలనుకున్నారు.

ట్రక్‌ ఏర్పాటుకు కావాల్సిన పెట్టుబడిని బ్యాంక్‌లో రుణం తీసుకున్నారు. అలా 2019లో బీసెంట్‌నగర్‌ బీచ్‌ దగ్గర ది టికిల్‌ ట్రక్‌ ప్రారంభించారు. అందుబాటు ధరల్లో ఉండడంతో బీచ్‌కు వచ్చినవారంతా ఓసారి రుచి చూద్దామని ప్రయత్నించారు. రానురాను కొత్తదనం ఆస్వాదించే వారంతా మళ్లీ మళ్లీ రావడం మొదలుపెట్టారు. అలా ది టికిల్‌ ట్రక్‌ అనతికాలంలోనే జనాలకు చేరువైంది.

జామున్‌, బూందీ బటర్‌మిల్క్‌, గజర్‌ హల్వా, మోజిటో... వినడానికి వెరైటీగా ఉన్నాయి కదూ..! ఇవన్నీ టికిల్‌ ట్రక్‌లో లభించే ఐస్‌క్రీమ్‌ రకాలు. ఈ రుచులు ఆస్వాదించడానికే నగరం నలుమూలల నుంచి జనం వస్తుంటారు. వచ్చినవారంతా ఒకటికి మించి ఎక్కువ రుచుల్ని ఆస్వాదిస్తున్నారు.

ఈ బృందం ప్రారంభించేనాటికీ... ఫుడ్‌ ట్రక్‌లైతే ఉన్నాయి కానీ, ప్రత్యేకంగా ఐస్‌క్రీమ్‌ ట్రక్‌లు ఎక్కడా లేవు. దీంతో వివిధ ప్రభుత్వ శాఖల నుంచి అనుమతులు తీసుకోవడానికి ఎంతో శ్రమించారు. ఏది ఏమైనప్పటికీ.. ప్రస్తుతం తన కలల బండిని నడుపుతూ జీవితాన్ని ఆస్వాదిస్తున్నాడు...భరత్‌ జయంత్. ఆదాయం కంటే ఎంత మందికి చేరువయ్యామన్నదే లెక్కలోకి వస్తుంది.. అనే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నారు... టికిల్‌ ట్రక్‌ నిర్వాహకులు.

Last Updated : Mar 15, 2021, 11:58 AM IST

ABOUT THE AUTHOR

...view details