కరోనాను అరికట్టడానికి ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. క్రమంగా దీన్ని పొడిగిస్తూ వస్తున్న తరుణంలో... ప్రజలు తమ అవసరాల కోసం బయటికి రావడం మొదలుపెట్టారు. రోడ్లు నిర్మానుష్యంగా ఉన్నందున పనిమీద బయటికొచ్చిన వారు వాహనాలను వేగంగా నడుపుతున్నారు. ఈ క్రమంలో కొన్నిచోట్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. మే నెల మొదటి నుంచే రొడ్డెక్కే వాహనాల సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది. మొదటి 13రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా 388 ప్రమాదాలు చోటు చేసుకున్నాయి.
145 ఘోర ప్రమాదాలు..
రాష్ట్రంలో ఏటా 22వేల ప్రమాదాలు జరుగుతుంటాయి. సగటున రోజులు 60 ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. లాక్డౌన్ అమలు చేసిన కొత్తలో రోజు 5 ప్రమాదాలు జరిగాయి. మొదటి యాభై రోజుల వరకు ఈ సంఖ్య సరాసరి 5 గానే ఉంది. కానీ మే మాసంలో ఈ సంఖ్య పెరిగింది. మొదటి 13 రోజుల్లో 388 ప్రమాదాలు జరిగాయి. ఇందులో 243 సాధారణ ప్రమాదాలు కాగా, 145 ఘోర ప్రమాదాలు. ఈ ప్రమాదాల్లో 154మంది మృతి చెందారు.