Pond Accidents in Telangana : నీటితో చెలగాటం ప్రాణాల మీదకు తెస్తోంది. మండే ఎండల నుంచి ఉపశమనం కోసం ఈత కొట్టేందుకు వెళ్లి మునిగి చనిపోతున్న వారి సంఖ్య రాష్ట్రంలో ఏటికేడు పెరుగుతోంది. ఇటీవల ఒక్కరోజే రాష్ట్రంలో ఆరుగురు బాలురు నీళ్లలో పడి చనిపోయారు. గతవారం వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలో తాత, తండ్రి, కుమారుడు కూడా ఒకరిని కాపాడ్డానికి మరొకరు నీటిలో మునిగిపోయారు. తరచూ రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ఉదంతాలు నమోదవుతున్నాయి. జలకాలాటలంటే ఎవరికైనా ఇష్టమే. అయితే కనీస జాగ్రత్తలు పాటించకుండా, ఏమాత్రం అవగాహన లేని చెరువులు, కుంటల్లోకి దిగుతుండటం వల్ల ప్రాణాపాయం తలెత్తుతోంది. ముఖ్యంగా ఎండ నుంచి ఉపశమనం కోసం వేసవిలో ఇలాంటి దుర్ఘటనలు ఎక్కువగా నమోదవుతుంటాయి.
ఇవీ కారణాలు
- Pond Accidents Increased in Telangana : గ్రామీణ ప్రాంతాల్లో చెరువులు, కుంటల్లో రకరకాల అవసరాల కోసం విచ్చలవిడిగా మట్టి తవ్వుతున్నారు. దాంతో పెద్దపెద్ద గోతులు ఏర్పడుతున్నాయి. నీళ్లు ఉన్నప్పుడు ఇవి బయటకు కనిపించవు. ఒడ్డునే అనుకుని దిగుతున్న పిల్లలు ఒక్కసారిగా మునిగిపోతున్నారు.
- కాపాడేందుకు వెళ్లి కూడా ఎక్కువమంది చనిపోతున్నారు. నలుగురైదుగురు స్నేహితులు కలిసి ఈతకు వెళ్తుంటారు. వారిలో ఒకరు మునిగిపోతుంటే కాపాడేందుకు మిగతా వారు ప్రయత్నించి, వారూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
- పట్టణాలు, నగర శివార్లలో క్వారీలు ఉంటున్నాయి. వర్షాలు పడ్డప్పుడు ఇవి నిండిపోతాయి. వాటిలో ఈత కొట్టేందుకు వెళ్లి మరికొందరు మృత్యువాతపడుతున్నారు. చెరువులు, కుంటల కంటే ఇవి మరింత ప్రమాదకరం. నిట్ట నిలువుగా, చాలా లోతులో ఉంటాయి. కాబట్టి కాలు పెడితే మునిగిపోయినట్లే. జలపాతాల వద్ద కూడా ఇదే పరిస్థితి.
కాపాడేవారూ జరభద్రం
Accidents in Pond in Telangana : కళ్లముందే ఎవరైనా మునిగిపోతుంటే ఒడ్డున ఉన్నవారికి వెంటనే ఏమీ తోచదు. ముందూ వెనుక ఆలోచించకుండా వారిని కాపాడటం కోసం నీళ్లలోకి దూకేస్తుంటారు. ఇదీ ప్రమాదమే. రక్షించడానికి వెళ్లేవారు తగిన జాగ్రత్తలు పాటించాలి. వీలైతే ఒడ్డుమీది నుంచే తాడు, తువ్వాలు వంటివి అందించి బయటకు లాగాలి. లేకపోతే నీళ్లలో తేలియాడే బెండు, గాలితో నిండిన ప్లాస్టిక్ డబ్బాలు, వాహనాల ట్యూబుల్లాంటివి అందుబాటులో ఉంటే వాటి సాయంతో కాపాడేందుకు ప్రయత్నించాలి.
ఈత వస్తేనే నీటిలో దిగాలి. ఒంటి మీద దుస్తులతో నీటిలోకి దిగితే వాటి బరువు ఇబ్బందిగా మారుతుంది. బాధితులను తక్షణం కాపాడాల్సిన పరిస్థితుల్లో 20 సెకన్లలో వారిని చేరడానికి ప్రయత్నించాలి. లోదుస్తులు మాత్రమే ఉంచుకుని, చొక్కా నోట కరచుకుని నీట్లోకి దిగితే.. మునిగిపోతున్నవారికి ఆసరా అందించడానికి వీలుంటుంది.
పెరుగుతున్న మరణాలు