ఏపీ తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో బుధవారం ఉదయం నుంచీ రాత్రి వరకూ ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. శ్రీకాకుళం జిల్లా సంతకవిటి తహసీల్దార్ కార్యాలయంలో... 30 పట్టాదారు పాస్‌బుక్‌లు ఇవ్వకుండా ఉంచినట్లు గుర్తించారు. స్పందన, మీ సేవ ద్వారా వచ్చిన ఫిర్యాదులు 2 నెలలుగా పెండింగ్‌లో ఉన్నట్లు తేల్చారు. 22 వేల 810 రూపాయల నగదు అనధికారికంగా ఉందని గుర్తించారు. విజయనగరం బాలాజీపేట తహసీల్దార్ కార్యాలయంలో... 95 పాస్‌బుక్‌లు లబ్ధిదారులకు ఇవ్వలేదని, 1857 ఫిర్యాదులు ఏ కారణం లేకుండానే తిరస్కరించినట్లు గుర్తించారు.
అనధికారిక సిబ్బంది...
విశాఖ కశింకోటలో... 941 ఫిర్యాదులు తిరస్కరిస్తే... తనిఖీల్లో 47 ఫిర్యాదులకు సంబంధించిన పత్రాలు మాత్రమే లభ్యమైనట్లు తేల్చారు. నలుగురు ప్రైవేటు వ్యక్తులు అనధికారికంగా పనిచేస్తున్నారని కనిపెట్టిన ఏసీబీ అధికారులు... సిబ్బంది వద్ద ఉన్న లెక్కచూపని 27 వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఏలూరు కొయ్యగుడెంలో 12 వేల 797 ఫిర్యాదుల్లో అకారణంగా 706 ఫిర్యాదులు తిరస్కరించినట్లు అనిశా గుర్తించింది. అనధికారికంగా ఓ వ్యక్తి కార్యాలయంలో పని చేస్తున్నారని, సిబ్బంది వద్ద లెక్కతేలని నగదు 5 వేల 80 రూపాయలు ఉందని తేల్చారు.
2లక్షల 28వేలు స్వాధీనం...
కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం తహసీల్దార్ కార్యాలయం ఆవరణలోని కారులో 2లక్షల28 వేల రూపాయల అనధికారిక నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సరైన కారణం లేకుండా 8 వేల 85 ఫిర్యాదులు తిరస్కరించారని గుర్తించారు. జగ్గయ్యపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో లెక్కచూపని 40 వేల రూపాయల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అక్కడున్న ఇద్దరు ప్రైవేటు వ్యక్తులు... డబ్బులు వసూలు చేస్తున్నట్లు తనిఖీల్లో బయటపడింది. గుంటూరు జిల్లా రాజుపాలెం తహసిల్దార్ కార్యాలయంలో 4 వేల 510 రూపాయలు లెక్కతేలని సొమ్మును స్వాధీనం చేసుకున్న అనిశా అధికారులు... 102 పట్టాదారు పుస్తకాలు లబ్ధిదారులకు పంపిణీ చేయకుండా ఉంచారని గుర్తించారు.