పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయంలో పలు విభాగాల్లో అక్రమాలను బయట పెట్టేందుకు అవినీతి నిరోధక శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ప్రసాదాల తయారీ, విక్రయ కేంద్రాలు, టోల్గేట్, పరిపాలనా విభాగం, సెంట్రల్ స్టోర్, ఇంజినీరింగ్ సెక్షన్ ఇలా అన్ని విభాగాల్లో తనిఖీలు చేసి దస్త్రాలను పరిశీలించి వివరాలు సేకరించారు. ఏసీబీ అధికారులమంటూ కొంతమంది వ్యక్తులు ద్వారకా తిరుమల దేవస్థానం ఈవో ఆర్.ప్రభాకరరావును బెదిరించి రూ.1.97 లక్షలు వసూలు చేసిన విషయం వెలుగులోకి రావడం, దేవస్థానంలో పలు విభాగాల్లో అక్రమాలు జరిగాయన్న సమాచారం మేరకు సోదాలు చేస్తున్నట్లు అనిశా డీఎస్పీ తెలిపారు.
ముఖ్యమైన పలు దస్త్రాలను సీజ్ చేసినట్లు అనిశా అధికారులు చెప్పారు. ప్రసాదాల తయారీ విభాగంలో జరిగిన నెయ్యి కుంభకోణానికి సంబంధించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి విభాగంలో కూడా అక్రమాలు జరిగినట్లు గుర్తించామని, విచారణ కొనసాగుతోందని చెప్పారు. అవినీతికి పాల్పడిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు వారి నుంచి సొమ్మును రికవరీ చేస్తామని పేర్కొన్నారు.