తెలంగాణ

telangana

ETV Bharat / city

లంచం తీసుకుంటే మీరూ జైలుకే...సర్పంచ్, ఉపసర్పంచ్​లకు షాక్ - అవినీతి నిరోధకశాఖ

సర్పంచులు.. ఉప సర్పంచులకు అవినీతి నిరోధకశాఖ షాక్‌లు ఇస్తోంది. లంచం తీసుకుంటున్న సర్పంచులు, ఉప సర్పంచులేకాదు... సర్పంచుల భర్తలను కూడా అరెస్ట్‌ చేస్తోంది. అవినీతికి పాల్పడితే... ఎవరినైనా విడిచిపెట్టేదిలేదని... తన కార్యాచరణతో అనిశా హెచ్చరికలు చేస్తోంది.

acb arresting sarpanches in telangana
acb arresting sarpanches in telangana

By

Published : Mar 9, 2021, 8:45 AM IST

ప్రభుత్వ అధికారులు లంచం తీసుకుంటేనే అనిశా అధికారులు రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకుంటారు. ప్రజా ప్రతినిధులపై చర్యలు తీసుకునేందుకు అనిశాకు అధికారం లేదనుకుంటున్న కొందరు సర్పంచులు.. ఉప సర్పంచులకు అవినీతి నిరోధకశాఖ షాక్‌లు ఇస్తోంది. లంచం తీసుకుంటున్న సర్పంచులు, ఉప సర్పంచులేకాదు...సర్పంచుల భర్తలను అరెస్ట్‌ చేస్తోంది. ప్రివెన్షన్‌ ఆఫ్‌ కరప్షన్‌ చట్టం ప్రకారం కేసులు నమోదు చేస్తున్నారు. నాలుగు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఒక సర్పంచి, మరో సర్పంచి భర్తను లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. జనవరి చివరివారంలో మహేశ్వరం మండలం మాన్‌సాన్‌పల్లి గ్రామ సర్పంచి భర్త, ఉప సర్పంచులను రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకుని జైలుకు పంపించారు.

కలెక్టర్‌కు అధికారం..

సర్పంచి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, గ్రామ, తాలూకా, పార్లమెంట్‌ నియోజకవర్గ స్థాయిలో ప్రజాప్రతినిధులు. వీరిలో ఎవరైనా అవినీతికి పాల్పడ్డారని అనిశా అధికారులు తెలుసుకుని సాక్ష్యాధారాలతో పట్టుకోవచ్చు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను అరెస్ట్‌ చేసేందుకు ముందుగా శాసనసభ సభాపతి లేదా మండలి ఛైర్మన్‌ అనుమతి తీసుకోవాలి. మాక్కూడా ప్రజలు ఓట్లేశారు కదా.. తమను పట్టుకోవాలంటే ముందుగా అనుమతి తీసుకోవాలని కొందరు సర్పంచులు భావిస్తున్నారు. సర్పంచులు, ఉప సర్పంచులను లంచం తీసుకుంటూ పట్టుకున్న తర్వాత అరెస్టు చేసేందుకు అనిశా అధికారులకు చట్టబద్ధంగా అధికారం ఉంది. సర్పంచులు, ఉప సర్పంచులకు ప్రభుత్వ కార్యాలయం ఉంటుంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలకు ప్రభుత్వ కార్యాలయాలుండవు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అవినీతికి పాల్పడితే వారిని పదవుల్లోంచి అర్ధాంతరంగా తొలగించబోరు. సర్పంచులు..ఉప సర్పంచులను జిల్లా కలెక్టర్‌కు సస్పెండ్‌ చేసే అధికారం ఉంటుంది.

రూ.లక్షల్లోనే రాయ‘బేరాలు’..

హైదరాబాద్‌ శివార్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు సమీపంలో ఉన్న గ్రామాల్లో కొద్దినెలల నుంచి వెంచర్లు ప్రారంభమయ్యాయి. రియల్‌ వ్యాపారం పుంజుకోవడంతో వెంచర్లు వేస్తున్న వ్యక్తులు, సంస్థలు అనుమతుల కోసం ఎంపీడీవో, పంచాయతీ కార్యాలయాలకు వెళ్తున్నారు. అక్కడే ఉంటున్న కొందరు సర్పంచులు తమకు లంచం ఇస్తేనే వెంచర్లు వేసేందుకు, సరిహద్దు కంచెలు నిర్మించేందుకు అనుమతులిస్తామంటున్నారు. నిరభ్యంతర పత్రాల కోసం రూ.లక్షల్లో కావాలంటూ బేరాలు కొనసాగిస్తున్నారు. పూడూరు సమీపంలోని మన్నెగూడ సర్పంచి వినోద్‌ గౌడ్‌ మూడు రోజుల క్రితం భవన నిర్మాణదారుడిని రూ.20లక్షలు ఇమ్మంటూ డిమాండ్‌ చేశాడు. జనవరి నెల చివరివారంలో మహేశ్వరం మండలం మాన్‌సాన్‌పల్లి గ్రామ సర్పంచి భర్త కంది రమేష్‌, ఉప సర్పంచ్‌ నరసింహ యాదవ్‌లు ఓ రియల్‌ వెంచర్‌ సంస్థ నుంచి రూ.7.5లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ఇదే వ్యవహారంలో ఎంపీడీవో కూడా ఏసీబీకి చిక్కారు.

ఇదీ చూడండి:40 శాతం కోర్సులు ‘స్వయం’లో చదివే వీలు!

ABOUT THE AUTHOR

...view details