ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF)కి సంబంధించి 2014 నుంచి పలు అక్రమాలు, అవకతవకలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలపై తాజాగా నమోదు చేసిన కేసులో ఏసీబీ బుధవారం నలుగురిని అరెస్టు చేసింది. సీఎంఆర్‌ఎఫ్ కార్యాలయంలో సబార్డినేట్ సీహెచ్ సుబ్రహ్మణ్యం, ఆయన అనుచరుడు చదలవాడ మురళీకృష్ణ, సచివాలయంలో రెవెన్యూ శాఖలో ఆఫీస్ సబార్డినేట్ సోకా రమేష్‌లతో పాటు తూర్పుగోదావరి జిల్లాలోని కొందరు ఎమ్మెల్యేలకు ప్రైవేటు పీఏగా పనిచేస్తున్నానని చెప్పుకునే కొండేపూడి జగదీష్ ధనరాజ్ అలియాస్ నానీని అరెస్టు చేసి విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరు పరిచింది.
రూ. 60లక్షలు పక్కదారి
2014 నుంచి మంజూరైన సీఎంఆర్‌ఎఫ్ క్లెయిములలో కొన్నింటిని పరిశీలించగా, రూ.60 లక్షలు పక్కదారి పట్టినట్లు తేలిందని ఏసీబీ బుధవారం వెల్లడించింది. దర్యాప్తు పూర్తయితే మొత్తం వివరాలు బయటికొస్తాయని తెలిపింది. 2014 నుంచి మంజూరైన వాటిల్లో అనుమానాస్పద 88 క్లెయిమ్‌లను పరిశీలించిన ఏసీబీ... వాటి కోసం రూ.1.81 కోట్లు మంజూరైనట్లు తేల్చింది. వాటిల్లో 35 క్లెయిములకు సంబంధించి రూ.61.68 లక్షలు నకిలీ దరఖాస్తుదారుల ఖాతాల్లో జమయ్యాయని, మిగతా 55 క్లెయిములకు సంబంధించిన రూ.1.20 కోట్లును వారి ఖాతాలకు జమచేయకుండా నిలిపివేయించామని ఏసీబీ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది.