నేడు భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఎ.పి.జె.అబ్దుల్ కలాం వర్థంతి. ఆయన గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువే. సాధారణ కుటుంబంలో పుట్టి ఇంటింటికీ తిరుగుతూ దిన పత్రికలు వేసిన కలాం.. భారత క్షిపణి సాంకేతికత పితామహుడిగా పేరు తెచ్చుకున్న వైనం, దేశ ప్రథమ పౌరుడిగా ఎదిగిన తీరు అనిర్వచనీయం! అడుగడుగునా ఆటుపోట్లు ఎదురైనా మొక్కవోని పట్టుదలతో ఆయన సాగించిన ప్రయాణం అత్యద్భుతం! సమాజంలో గుణాత్మక మార్పు తీసుకొచ్చే శక్తి యువతకే ఉందని కలాం బలంగా విశ్వసించేవారు.
అందుకే వారిలో స్ఫూర్తి నింపేందుకుగాను తరచూ విద్యాసంస్థలను సందర్శించి ప్రసంగాలు చేసేవారు. విద్యార్థులు అడిగే ప్రశ్నలకు ఓపికతో, చిరునవ్వుతో సమాధానాలిచ్చేవారు. కలాం తన జీవిత కాలంలో చెప్పిన ఎన్నో మాటలు నేటికీ యువతకు ఆదర్శప్రాయమే. ఆచరణీయమే! పలు సందర్భాల్లో ఆయన చెప్పిన స్ఫూర్తిదాయక మాటలను ఒక్కసారి గుర్తుచేసుకుంటే..
పనిని ప్రేమించండి: మనం నిరంతరం ప్రగతి పథంలో దూసుకెళ్లాలంటే.. మనకు ఇష్టమైన రంగాలను ఎంచుకోవాలనేవారు కలాం. ‘‘చేసే పనిని ప్రేమించాలి. పని ఎప్పుడూ మనకు విసుగు తెప్పించేదిగా ఉండకూడదు’’ అని ఆయన చెప్పేవారు.‘‘రోజుకు 18 గంటలు పనిచేస్తే మీకు అలుపు రావట్లేదా?’’ అని ఓ వ్యక్తి ప్రశ్నించగా.. ‘‘నేను నా పనిని ఆస్వాదిస్తాను. అది నాకు సంతోషాన్నిస్తుంది. నిరంతరం సంతోషంగా ఉన్నప్పుడు విసుగెందుకు వస్తుంది?’’ అంటూ కలాం ఠక్కున సమాధానమిచ్చారు.జీవితంలో విజయం సాధించాలంటే ప్రధానంగా నాలుగు లక్షణాలు అవసరమంటారు కలాం.
- స్పష్టమైన లక్ష్యం
- జ్ఞాన సముపార్జన
- కఠోర పరిశ్రమ
- పట్టుదల
- 'తొలి విజయం తర్వాత విశ్రమించకండి. ఎందుకంటే రెండోసారి మీరు విజయవంతమవ్వకపోతే, మీ తొలి గెలుపు కేవలం అదృష్టవశాత్తూ దక్కిందేనని ప్రచారం చేసేందుకు చాలామంది కాచుకుకూర్చుంటారు.
- ''కలలంటే మనకు నిద్రలో వచ్చేవి కావు, మనల్ని నిద్ర పోకుండా చేసేవి.'
ఇదీ చదవండి :Olympics Live: షూటింగ్లో నిరాశపర్చిన సౌరభ్- మను జోడీ