తెలంగాణ

telangana

ETV Bharat / city

'దురుద్దేశంతోనే నాపై కేసులు'.. హైకోర్టులో ఏబీవీ వ్యాజ్యం - ABV petition in AP High court

ABV PIL: నిఘా విభాగం అధిపతిగా పనిచేసిన సమయంలో భద్రతా పరికరాల కొనుగోలు వ్యవహారంలో ఏసీబీ తనపై నమోదు చేసిన కేసును రద్దు చేయాలని కోరుతూ సీనియర్ ఐపీఎస్​ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఏపీ హైకోర్టులో వ్యాజ్యం వేశారు. ఏపీ విజిలెన్స్‌ కమిషన్‌ ఆమోదం పొందకుండా సాధారణ విచారణ జరిపి తనపై కేసు పెట్టారన్నారు. తప్పుడు ఆరోపణలతో నమోదు చేసిన ఈ కేసును రద్దు చేయాలని కోరారు.

venkateshwararao
venkateshwararao

By

Published : Jul 5, 2022, 9:24 AM IST

ABV PIL: నిఘా విభాగాధిపతిగా పనిచేసిన సమయంలో భద్రత పరికరాల కొనుగోలు వ్యవహారంలో 2021 మార్చిలో ఏసీబీ తనపై నమోదు చేసిన కేసును రద్దు చేయాలని కోరుతూ సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వ్యాజ్యం వేశారు. పరికరాల కొనుగోలు కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చుచేసింది లేదని, ఒక్క పైసా ఎవరికి చెల్లించలేదన్నారు. ఏపీ విజిలెన్స్‌ కమిషన్‌ ఆమోదం పొందకుండా సాధారణ విచారణ జరిపి తనపై కేసు పెట్టారన్నారు. తప్పుడు ఆరోపణలతో నమోదు చేసిన ఈ కేసును రద్దు చేయాలని కోరారు.

ఈ వ్యాజ్యంలో తుది నిర్ణయం వెల్లడించే వరకు ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా చేపట్టే తదుపరి చర్యలను నిలువరించాలని కోరారు. భద్రత పరికరాల కొనుగోలు నిర్ణయంలో తన పాత్ర లేదని పిటిషన్లో పేర్కొన్నారు. తన వల్ల ఎలాంటి ఆర్థిక నష్టం జరగలేదన్నారు. సేవలందించినందుకు తన వద్ద ఉంచుకున్న రూ.10 లక్షలను ఎస్‌టీసీఐఎల్‌ (స్టేట్‌ ట్రేడింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా) సంస్థ వెనక్కి ఇచ్చిందని గుర్తుచేశారు.

ఎఫ్‌ఐఆర్‌లో ఆరోపిస్తున్నట్లు.. పరికరాలను సమకూర్చుకునే (ప్రొక్యూర్‌) ప్రక్రియను ప్రారంభించింది తను కాదని, అప్పటి డీజీపీ ప్రారంభించారని తెలిపారు. కొనుగోలు కమిటీ, సాంకేతిక కమిటీని కాంపిటెంట్‌ అథారిటీ అయిన డీజీపీ ఏర్పాటు చేశారని, ఈ విషయంలో తన పాత్ర లేదని ఏబీ వెంకటేశ్వరరావు వివరించారు. అధికార హోదాను అడ్డుపెట్టుకొని ఆ కమిటీల నిర్ణయాలను ప్రభావితం చేశాననడంలో వాస్తవం లేదని వెల్లడించారు. ఏసీబీ చేసిన విచారణలో కమిటీలలోని ఏ ఒక్క సభ్యుడినీ తాను ప్రభావితం చేసినట్లు చెప్పలేదన్నారు.

నేరపూర్వక చర్యకు పాల్పడినట్లు ఎఫ్‌ఐఆర్‌లో వివరాలు లేవన్నారు. అక్రమాలు జరగనప్పుడు, ఆర్థిక నష్టం వాటిల్లనప్పుడు ఏసీబీ చట్టం కింద కేసు చెల్లుబాటు కాదని తెలిపారు. మోసం చేసినట్లు, తన వల్ల ఒక్కరయినా మోసానికి గురయినట్లు ఆరోపణలు లేనందువల్ల ఐపీసీ సెక్షన్‌ 420 కింద కేసు నమోదు చెల్లదని పేర్కొన్నారు. ఎలాంటి ఆధారాలు లేకపోయినా.. పోలీసులు తనపై కక్ష సాధింపు కోసం ఒత్తిళ్లకు తలొగ్గి దురుద్దేశంతో కేసు నమోదు చేశారన్నారు.

ఇవీ చదవండి :రాష్ట్రంలో రెండ్రోజులుగా భారీ వర్షాలు.. నేడూ, రేపూ అదే పరిస్థితి..!

ABOUT THE AUTHOR

...view details