ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మకు పాలకమండలి ఛైర్మన్ సోమినాయుడు ఆషాఢ సారె సమర్పించారు. ఆగస్టు 8 వరకు సారె సమర్పించేందుకు భక్తులకు అనుమతిని ఇవ్వగా.. 3 రోజుల ముందే సారె సమర్పణ గురించి వివరాలు తెలపాలని అధికారులు వెల్లడించారు. కొవిడ్ నిబంధనల మేరకు సారె సమర్పణకు ఆలయంలో ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆలయ స్థానాచార్యులు, అర్చకులు, వైదిక కమిటీ, పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు.
కొవిడ్ నిబంధనలు తప్పనిసరి
భక్తులు కొవిడ్ నిబంధనలను పాటిస్తూ అమ్మవారికి ఆషాడ సారె సమర్పించవచ్చని ఆలయ అధికారులు తెలిపారు. ఆషాడ సారె సమర్పణకు రానున్న భక్తులు ముందుగా ఆలయ కార్యాలయం ఫోన్ నెంబర్లు 9493545253, 8341547300 లను మూడు రోజులు ముందుగా సంప్రదించి వివరాలు తెలియజేయాల్సి ఉందని అధికారులు స్పష్టం చేశారు. ముందుగా పేర్లు నమోదు చేసుకున్న వారికి సమయం నిర్దేశిస్తామని.. దానికి అనుగుణంగానే భక్తులు సారెతో ఆలయానికి చేరుకోవాలని సూచించారు. ఆషాఢ మాసంలో అమ్మవారి దర్శనానికి, సారె సమర్పణకు వచ్చే భక్తులు విధిగా కొవిడ్ నిబంధనలు తప్పక పాటించాలని దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం ఛైర్మన్ పైలా సోమినాయుడు స్పష్టం చేశారు.