2011 జనాభా లెక్కల ప్రకారం.. రాష్ట్ర జనాభా 3.53 కోట్లు ఉండగా అంచనాల ప్రకారం 2019 నాటికి 3.89 కోట్లకు చేరింది. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ లెక్కల ప్రకారం ఐదేళ్లలోపు పిల్లలు 29.10లక్షలు ఉండగా 13.9 లక్షల మందికి ఆధార్‌కార్డులు జారీ చేశారు. 5 నుంచి 18 ఏళ్లలోపు జనాభా 95.4లక్షలుండగా 82.13లక్షల మందికి జారీ చేశారు.
18 ఏళ్లు దాటిన జనాభా 2.65 కోట్లుగా ఉండగా 2.99 కోట్ల లెక్కన ఆధార్ కార్డులు జారీ చేసినట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. మొత్తం అంచనా జనాభా 3.89 కోట్లు ఉండగా 3.95 కోట్లు ఆధార్ కార్డులు ఉండడం వల్ల 102శాతం జారీ చేసినట్లు స్పష్టం అవుతోంది.
జనాభా 44 లక్షలు.. ఆధార్ కార్డులు 67 లక్షలు
హైదరాబాద్‌లో అంచనా జనాభా కంటే ఎక్కువ మంది ఆధార్ కార్డులు పొందినట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. హైదరాబాద్ జిల్లాలో 44.5లక్షల మంది జనాభా ఉండగా... 67.09లక్షల ఆధార్ కార్డులున్నాయి. హైదరాబాద్‌లో ఇతర రాష్ట్రాల నుంచి విద్య, ఉపాధి, ఇతరత్రా అవసరాలకు వస్తున్న కుటుంబాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది.