చెప్పుల షాపులోకి ఎవరైనా వెళ్లారంటే.. ఒక పట్టాన సెలక్షన్ కంప్లీట్ కాదు. కాలికి అందంగా ఉన్నాయా లేవా? అన్నది ఒక పాయింట్ అయితే.. ఖరీదు ఎంత అన్నది మరో పాయింట్. వారి వారి ఆర్థిక స్థోమతను బట్టి.. టాప్ గ్రేడ్ పాదరక్షలనే కొనుగోలు చేస్తారు. అందుకే.. 100 రూపాయల చెప్పుల నుంచి.. మూడు, నాలుగు లక్షల విలువైన బూట్ల వరకూ అమ్మకానికి సిద్ధంగా ఉంటాయి.
ఇలాంటి పాదరక్షల్లో.. ఎన్ని జతలైనా కొనుగోలు చేసే కెపాసిటీ ఉన్న ఓ 20 ఏళ్ల యువకుడి చెప్పుల స్టాండ్‌లో.. ఏకంగా 20 జతలు ఉండేవి. అంత రిచ్ కిడ్ అన్నమాట. అలాంటి వ్యక్తి ఉన్నట్టుండి ఆ చెప్పులన్నీ చెత్తకుండీలో విసిరేశాడు! అతనిపేరు జార్జ్వుడ్ విల్లే. ఇంగ్లాండ్‌లోని కేంబ్రిడ్జ్‌కు చెందిన వాడు. ఏడాది ముందు వరకూ ఇతని లుక్ ఓ రేంజ్ లో ఉండేది. వారంలో ప్రతిరోజూ వేసిన షూస్ వేయకుండా.. తొడిగిన షర్ట్ తొడక్కుండా జల్సా చేసేవాడు.
అయితే.. లాస్ట్ అక్టోబర్‌లో తల్లి, తాతతో కలిసి వాకింగ్ హాలిడేకు వెళ్లాడు. అప్పుడు అతనిలో ఓ ఆలోచన మెదిలింది. అసలు కాళ్లకు చెప్పులు ఎందుకు? వేసుకోకపోతే ఏమవుతుంది? అనే ప్రశ్న తనకు తానే వేసుకున్నాడు. ఇంట్లో వారిని అడిగితే.. ఏదో ఆన్సర్ ఇచ్చారు. ఆ సమాధానంతో సంతృప్తి చెందలేదు. దీంతో.. ఇక ఎప్పటికీ చెప్పులు వేసుకోకూడదని నిర్ణయించుకున్నాడు. ఏడాది కాలంగా అలాగే నడుస్తున్నాడు.
"నేను చెప్పుల్లేకుండా.. మొదటిసారిగా మా అమ్మ, తాతయ్యతో కలిసి రెస్టారెంట్‌కి వెళ్లాను. నిజంగా అదొక భిన్నమైన అనుభవం. అది నాకు ఎంతగానో నచ్చింది. గతంలో నేను ఇంట్లో కూడా చెప్పులు వేసుకునే తిరిగేవాడిని. ఇప్పుడు అవి లేకుండా గడ్డి మీద నడుస్తాను. మట్టిలో తిరుగుతాను. ఎంతో థ్రిల్లింగ్ గా ఉంది. అందుకే బేర్ ఫూట్ విధానాన్ని కంటిన్యూ చేస్తున్నాను." అంటాడు జార్జ్.