కొవిడ్‌పై పోరులో ముందుండి వైద్యులు నిరంతరం శ్రమిస్తున్న వేళ.. వారికి తోడ్పాటునందించే రీతిలో ఏపీలోని నెల్లూరు యువకుడు తయారు చేసిన రోబో ఆసక్తి రేపుతోంది. నగరానికి చెందిన పర్వేజ్ హుసేన్ తమిళనాడులోని అన్నామలై విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ చదివారు. కొవిడ్ బాధితుల వద్దకు వెళ్లి సేవలందించడం సవాలుగా మారిన వేళ.... కేవలం 80 వేల ఖర్చుతో ఆయన ఓ రోబోను తీర్చిదిద్దారు. ఏపీఆర్ హెల్పింగ్ హ్యాండ్స్ అనే స్వచ్ఛంద సంస్థ ఇందుకవసరమైన సహకారం అందించింది. సంయుక్త కలెక్టర్ వినోద్ కుమార్ ఈ విలక్షణ రోబోను ఆవిష్కరించగా.... నెల్లూరు జీజీహెచ్ కొవిడ్ వైద్యశాలలో వినియోగించనున్నారు. నెల్లూరు రోబోట్ అని అర్థం వచ్చేలా నెల్ బాట్ అనే పేరు పెట్టారు.
కొవిడ్ చికిత్సలో వైద్యులకు తోడ్పాటుగా... నెల్లూరు రోబో - robot designed by a young man in nellore
కొవిడ్ రోగులకు చికిత్స అందించడం అంటే ప్రాణాలకు తెగించి పోరాడటమే. రక్షణ దుస్తులు, మాస్కులు, కవచాలు ధరిస్తే తప్ప కనీసం దగ్గరకు కూడా వెళ్లలేని పరిస్థితి. మాటిమాటికీ ఈ విధంగా వెళ్లడం వల్ల ఆయా వస్తువులు వృథా కావడం మరో సమస్య. అయితే... ఓ యువ ఇంజినీర్ రూపొందించిన నెల్ బాట్ అనే నెల్లూరు రోబో.. వైద్యులకు చేదోడు వాదోడుగా నిలిచేందుకు ఉత్సాహం చూపుతోంది.
కొవిడ్ చికిత్సలో వైద్యులకు తోడ్పాటుగా... నెల్లూరు రోబో
కొవిడ్ రోగులకు ఆహారం, మందులు అందించేందుకు నెల్ బాట్ ఉపయోగపడనుంది. వైద్య సిబ్బంది పదేపదే వైరస్ బాధితుల వద్దకు వెళ్లడం ప్రమాదకరంగా మారిన పరిస్థితుల్లో ఈ రోబో సేవలు రక్షణ కవచంగా మారనున్నాయి. వైద్యులు దూరంగా ఉన్నా సరే రోగులతో మాట్లాడి వారి బాగోగులు తెలుసుకొనేలా ఇందులో ఏర్పాట్లు ఉన్నాయి. నెల్‌బాట్ పనితీరును పరిశీలించిన అధికారులు ఇలాంటివే మరికొన్ని తయారు చేయించేందుకు సిద్ధమయ్యారు.
ఇవీ చూడండి:సాదాసీదాగా తెజస వార్షికోత్సవం