Triangle Love Story: ఒడిశా రాష్ట్రం బర్గర్ జిల్లా గాస్లర్ బ్లాకులోని దన్బహర్ ప్రాంతానికి చెందిన సుస్మిత మహానంద్.. అదే ప్రాంతానికి చెందిన ఆశిష్ మహానంద్ ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి నాలుగేళ్ల క్రితం పెళ్లి కూడా చేసుకున్నారు. ఏడాదిన్నర క్రితం గుంటూరు జిల్లా దుగ్గిరాలకు మకాం మార్చి స్థానిక కర్మాగారంలో పనిచేస్తూ ఇక్కడే నివాసం ఉంటున్నారు. వారికి రెండేళ్ల పాప ఉండగా.. సుస్మిత రెండోసారి గర్భం దాల్చింది. ఆమె రెండు నెలల గర్భిణీగా ఉండగా.. ఆశిష్ ఒడిశాలో తాను మెుదట ప్రేమించిన అమ్మాయితో ఫోన్లో మాట్లాడుతుండటాన్నిగమనించి ప్రశ్నించింది. దీంతో భార్యాభర్తల మధ్య వివాదం ముదిరి ఆశిష్ ఇంట్లో నుంచి ఒడిశా వెళ్లిపోయాడు. తాను మొదట ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకొని వేరే ప్రాంతంలో కాపురం పెట్టాడు.
గత ఎనిమిది నెలలుగా తన భర్త కోసం సుస్మిత, ఆమె తల్లి వెతుకుతూనే ఉన్నారు. చేసేదిలేక ఒడిశాలోని తమ ప్రాంత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. నెల క్రితం సుస్మితకు రెండోసారి కాన్పు అయింది. ఇటీవల తన భర్త ఆ యువతితో కలిసి చేబ్రోలు సమీపంలోని దారాల కంపెనీలో పనిచేస్తున్నట్లు తెలుసుకున్న సుశ్మిత.. 10 రోజుల బాలింతగానే దుగ్గిరాల ఠాణాకు వచ్చి ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు ఆశిష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు దుగ్గిరాలకు తీసుకువచ్చారు. భార్యను వదిలేయటం సరైంది కాదని కౌన్సిలింగ్ ఇచ్చారు. ఏం జరిగిందో తెలియదు కానీ.. సాయంత్రానికి అతన్ని విడిచిపెట్టడంతో చెబ్రోలు వెళ్లిపోయాడు. కాగా.. పోలీసుల తీరుపై సుశ్మిత అసహనం వ్యక్తం చేస్తోంది. అతడిపై ఒడిశాలోనూ కేసు నమోదైందని.. అక్కడి పోలీసులకు అప్పగిస్తే తనకు న్యాయం జరిగేదని వాపోయారు. ఇప్పటికైనా పోలీసులు ఆశిష్‌ను అదుపులోకి తీసుకొని తనకు న్యాయం చేయాలని ఆమె కోరుతున్నారు.