న్యాయస్థానం ఆదేశాల్ని అమలు చేసేందుకు వెళ్లిన ప్రభుత్వ సిబ్బంది కళ్లలో కారం కొట్టిన ఘటన ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. రాయవరం మండలం నదురుబాద గ్రామానికి చెందిన మిర్తిపాటి జ్యోతికి చెందిన చౌక ధరల దుకాణం కోర్టు వివాదంలో ఉంది. ఈ దుకాణాన్ని లలిత మహిళ స్వశక్తి సంఘం సభ్యురాలికి అందజేయాల్సిందిగా న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. రెవెన్యూ అధికారులు ఆ ఇంటిని స్వాధీనం చేసుకునేందుకు వెళ్లగా... ఆమె నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది.
దీంతో స్వయంగా రామచంద్రపురం ఆర్డీవో సింధు సుబ్రహ్మణ్యం, డీఎస్పీ బాలచంద్రారెడ్డి సిబ్బందితో కలిసి జ్యోతి ఇంటికి వెళ్లారు. అదే సమయంలో తలుపులు మూసుకొని లోపలకు ఎవ్వరినీ రానీయకుండా అధికారులను ఇబ్బంది పెట్టింది. పోలీసులు, రెవెన్యూ, సచివాలయ సిబ్బంది బలవంతంగా తలుపులు తెరిచేందుకు ప్రయత్నించగా... అధికారుల కళ్లల్లో కారం చల్లింది. అనంతరం ఇనుప రాడ్డుతో దాడి చేసింది.