తెలంగాణ

telangana

ETV Bharat / city

రెవెన్యూశాఖలో సమ్మె సైరన్‌.. కార్యాచరణ ప్రకటించిన వీఆర్‌ఏ ఐకాస - కార్యాచరణ ప్రకటించిన వీఆర్‌ఏ ఐకాస

Strike in Revenue Department: రెవెన్యూశాఖలో సమ్మె సైరన్‌ మోగింది. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చేదాకా విధులకు హాజరయ్యేది లేదంటూ వీఆర్‌ఏలు సమ్మె చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నెల 25 నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్లు ఐకాస నాయకులు పేర్కొన్నారు. ఈ నెల 15 నుంచి నిర్వహించనున్న రెవెన్యూ సదస్సులకు దూరంగా ఉండనున్నట్లు వీఆర్వో ఐకాస ప్రకటించింది.

revenue department
revenue department

By

Published : Jul 9, 2022, 9:23 AM IST

Strike in Revenue Department: రాష్ట్రంలోని రెవెన్యూశాఖలో సమ్మె సైరన్‌ మోగింది. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చేదాకా విధులకు హాజరయ్యేది లేదంటూ వీఆర్‌ఏలు సమ్మె చేస్తున్నట్లు ప్రకటించారు. శుక్రవారం భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) కార్యాలయానికి నోటీసు అందజేశారు. ఈ నెల 25 నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్లు ఐకాస నాయకులు ప్రకటించారు. ఈ మేరకు సీసీఎల్‌ఏ కార్యాలయం ఆవరణలో ఐకాస ఛైర్మన్‌ ఎం.రాజయ్య, కో ఛైర్మన్‌ రమేష్‌ బహదూర్‌ తదితరులు విలేకరులతో మాట్లాడి వివరాలు తెలిపారు.

హామీలు నెరవేర్చనందుకే..‘2020 సెప్టెంబరు 9న శాసనసభలో కొత్త రెవెన్యూ చట్టంపై చర్చ సందర్భంగా వీఆర్‌ఏలకు పే స్కేలు ఇస్తామని, తండ్రుల స్థానంలో అర్హులైన పిల్లలు ఉంటే ఉద్యోగాలు కల్పిస్తామని, అర్హత ఉన్నవారికి పదోన్నతి కల్పిస్తామని సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు. ఉద్యోగాలు క్రమబద్ధీకరిస్తామని రెండుసార్లు సభలో సీఎం ప్రకటించారు. 2017 ఫిబ్రవరి 24న కూడా ప్రగతి భవన్‌లో క్రమబద్ధీకరణపై ప్రకటన చేశారు. ఇప్పటి వరకు ఏ హామీ నెరవేరలేదు. రాష్ట్రంలో 21వేల మంది వీఆర్‌ఏలు, 2500 మంది డైరెక్ట్‌ రిక్రూట్‌ వీఆర్‌ఏలు విధుల్లో ఉన్నారు. 90 శాతం మంది వెనుకబడిన సామాజిక వర్గాలకు చెందిన నిరుపేదలే ఉన్నారు. పెరిగిన జీవన వ్యయం నేపథ్యంలో అర్ధాకలితో జీవిస్తున్నారు. ప్రభుత్వానికి వివిధ రూపాల్లో ఇప్పటికే నిరసన తెలియజేశాం. రెవెన్యూశాఖ, ప్రభుత్వం నుంచి స్పందన లేని కారణంగా సమ్మె చేయాలని నిర్ణయించాం’ అని వారు లేఖలో పేర్కొన్నారు.

కార్యాచరణ ప్రకటించిన వీఆర్‌ఏ ఐకాస..రోజువారీ కార్యాచరణను చేపట్టాలని ఐకాస నిర్ణయించింది. 11 నుంచి రోజుకో జిల్లాలో సమావేశం, 15 నుంచి 22వరకు కలెక్టరేట్ల ముందు రిలే నిరాహార దీక్షలు, 23న కలెక్టరేట్ల ముట్టడి చేయనున్నారు. 25 నుంచి మండల కేంద్రాల్లో నిరవధికంగా సమ్మె కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది.

ప్రభుత్వం అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం లేదు..ఈ నెల 15 నుంచి నిర్వహించనున్న రెవెన్యూ సదస్సులకు దూరంగా ఉండనున్నట్లు వీఆర్వో ఐకాస ప్రకటించింది. శుక్రవారం హైదరాబాద్‌లో సమావేశమైన సంఘాలన్నీ కలిసి ఐకాసగా ఏర్పడ్డాయి. అధ్యక్షుడుగా గోల్కొండ సతీష్‌, ప్రధాన కార్యదర్శిగా సుధాకర్‌, కన్వీనర్‌గా వింజమూరి ఈశ్వర్‌ను ఎన్నుకున్నారు. సమావేశం అనంతరం ఐకాస ప్రకటన విడుదల చేసింది. జాబ్‌ఛార్ట్‌, కారుణ్య నియామకాలు, పదోన్నతులు, ఇంక్రిమెంట్లు, శాఖాపరమైన పరీక్షలు లేవు. కనీసం సమస్యలు చెప్పుకొందామన్నా సీఎస్‌, ప్రభుత్వం అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం లేదు. రెవెన్యూ సదస్సులకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాం’ అని ఐకాస పేర్కొంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details