తప్పని చెప్పినందుకు రోడ్డునే తవ్వేశారు! - మల్కాపురంలో రోడ్డు తవ్విన వ్యక్తి
అతను చెరువులో మట్టిని అక్రమంగా తరలిస్తున్నాడు. అది తప్పని గ్రామస్థులు అడ్డుకున్నారు. అంతే... నన్నే ఆపుతారా అంటూ ఆగ్రహంతో.. ప్రజలు నడిచే రోడ్డును తవ్వేసిన ఘటన ఏపీలోని అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది.
![తప్పని చెప్పినందుకు రోడ్డునే తవ్వేశారు! a-person-road-digging-in-the-malkapuram-ananthapuram-district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6423316-1055-6423316-1584329081727.jpg)
చెరువులో మట్టిని అక్రమంగా తరలిస్తున్నాడని అడ్డుకున్నందుకు ఆ గ్రామస్థులకు రహదారి సౌకర్యం లేకుండా చేశాడు ఓ వ్యక్తి. ఏపీలోని అనంతపురం జిల్లా ధర్మవరం మండలం మల్కాపురం వద్ద ఈ ఘటన జరిగింది. జిల్లాలోని గొట్లూరుకు చెందిన పిట్ట రాజు అనే వ్యక్తి మల్కాపురం చెరువులో మట్టిని ట్రాక్టర్లతో అక్రమంగా తరలిస్తున్నాడు. అది గమనించిన మల్కాపురం గ్రామస్థులు వాహనాలను అడ్డుకున్నారు. దాంతో ఆగ్రహించిన రాజు, అతని అనుచరులు జేసీబీతో రోడ్డు తవ్వేశారు. రాకపోకలు స్తంభించటంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రహదారిని మరమ్మతు చేయించారు. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.