Man vanished in Canal: ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. వాగులపై వంతెన లేకపోవడం వల్ల కొన్ని చోట్ల ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాగు దాటడానికి ప్రయత్నిస్తూ ప్రవాహంలో కొట్టుకుపోతున్నారు. ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలంలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. బుట్టాయగూడెం సహా పలు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉదయం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు తోడు ఎగువ నుంచి వరద ప్రవాహం వస్తుండటంతో తూర్పు కాలువ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో కోటరామచంద్రాపురం ఐటీడీఏకు వెళ్లే మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి.
Live Video: వద్దన్నా వెళ్లాడు.. వాగులో కొట్టుకుపోయాడు... కానీ..!
Man vanished in Canal: ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగును చూసి అందరూ.. భయపడుతుంటే ఒక్కడు మాత్రం ఆ వరదకే సవాలు విసురుతూ వాగు దాటే ప్రయత్నం చేశాడు. ఒడ్డున ఉన్నవాళ్లు ఊహించినట్టుగానే.. నాలుగు అడుగులు వేసాడో లేదో నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాడు. అతని ఈ భూమ్మీద నూకలు ఇంకా మిగిలున్నట్లుంది. అదృష్టం కొద్దీ ప్రాణాలతో క్షేమంగా బయటపడ్డాడు. అసలు ఈ తతంగమంతా ఎలా జరిగిందో మీరూ చూడండి.
ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగును చూసి ఎక్కడి వారు అక్కడే ఆగిపోయారు. కన్నాపురానికి చెందిన వెంకటేశ్ మాత్రం కాలువను దాటేందుకు సాహసం చేశాడు. ఒడ్డున ఉన్నవాళ్లు వద్దని వారిస్తున్నా వినకుండా వాగు దాటే ప్రయత్నం చేశాడు. వాగులో కొద్ది దూరం వెళ్లగానే ప్రవహానికి కొట్టుకుపోయాడు. ఇక అతను బతికి బట్టకట్టే ఛాన్సే లేదని అనుకుంటున్న తరుణంలో అదృష్టవశాత్తూ కొద్ది దూరంలో ఓ చెట్టుకు చిక్కుకున్నాడు. అప్రమత్తమైన స్థానికులు వెంకటేశ్‌ను కాపాడి ఒడ్డుకు చేర్చారు. దీంతో బతుకు జీవుడా అంటూ వెంకటేశ్ అక్కడి నుంచి పలాయనం చిత్తగించాడు.
ఇవీ చూడండి: