TDP MAHANADU: తొలిరోజు మహానాడు.. పరవశించిన పసుపుదండు TDP MAHANADU :మూడేళ్ల తర్వాత జరుగుతున్న మహానాడుకు తెలుగుదేశం కార్యకర్తలు సమరోత్సాహంతో కదిలివచ్చారు. మహానాడు తొలిరోజున 12 వేల మందికి మాత్రమే ఆహ్వానం పంపగా... రెట్టింపు సంఖ్యలో తరలివచ్చారు. కార్యకర్తల్లో ఎవరిని కదిలించినా ఉత్సాహం తొణికిసలాడింది. నేతల ప్రసంగాలు వింటూ... నాయకులను పలకరిస్తూ... తోటి కార్యకర్తలతో కలిసి మహానాడు ప్రాంగణంలో సందడి చేశారు.
అబద్ధపు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన వైకాపా... ప్రజల నడ్డివిరిచేలా పాలన సాగిస్తోందని తెలుగుదేశం కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోయి... అవినీతి, అరాచకం ప్రబలాయని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించుకుని, చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసేందుకు అందరం కంకణబద్దులై ఉన్నట్లు తెలిపారు.
పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నవారిని మహానాడులో ప్రత్యేకంగా గుర్తించారు. మహానాడు ప్రాంగణంలో వారి కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశారు. తెలుగుదేశం మహా వృక్షంగా ఎదగడంలో కృషి చేసిన వారి చేతి ముద్రలను ఫ్లెక్సీలపై సేకరించారు. పార్టీ అభివృద్ధికి పాటుపడిన వారిని గుర్తించేందుకే ఈ ఏర్పాటు చేసినట్లు తెలుగుదేశం నేతలు తెలిపారు.
మహానాడు ప్రాంగణంలో తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ఫొటో ఎగ్జిబిషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వెండితెరపై అన్నగారి అభినయం మొదలుకుని... రాజకీయాల్లో సృష్టించిన సంచలనాలకు సంబంధించిన చిత్రాలను ఎగ్జిబిషన్‌లో పొందుపరిచారు. ఈ చిత్రాలు తెలుగుదేశం కార్యకర్తలను గత స్మృతుల్లోకి తీసుకెళ్లాయి. ఆ మహనీయుడి గొప్పతనాన్ని, తెలుగు జాతికి చేసిన సేవలను కార్యకర్తలు గుర్తు చేసుకున్నారు.
ఇవీ చదవండి :