చకచకా కత్తి తిప్పుతున్న ఈమె పేరు వెన్నెల నీలకంఠ. సొంతూరు కర్ణాటకలోని మంగళూరు పక్కన చిన్నగ్రామం. విశాఖలో జరిగిన జాతీయస్థాయి కర్రసాము, కత్తిసాము, శిలంబం పోటీల్లో.. కర్రసాము, కత్తిసాము, డబుల్ కర్రసాములో పతకాలు కైవసం చేసుకుంది. చిన్నప్పటి నుంచీ మార్షల్ ఆర్ట్స్ అంటే మక్కువతో సాధన చేశానంటోంది వెన్నెల.
వెన్నెల ప్రత్యేకతలివే..
మంగళూరులో ఎంటెక్ చేస్తున్న వెన్నెల.. తండ్రి ప్రోత్సాహంతో చిన్నప్పుడే మార్షల్ ఆర్ట్స్‌పై దృష్టి పెట్టింది. జూడో, మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకుంది. తర్వాత.. కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించింది. యోగా, స్కేటింగ్, బాక్సింగ్, ఆర్చరీ.. వీటన్నింటిలోనూ రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో పతకాలు, సర్టిఫికెట్లు సొంతం చేసుకుంది.
బాధ్యతల భారం ఉన్నా..
అయితే.. తండ్రి మరణం తర్వాత.. తల్లి కూలిపనికి వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. వెన్నెల తమ్ముళ్లు పాఠశాల విద్యలో ఉన్నారు. దీంతో.. బాధ్యతల భారం తల్లిపై పడకుండా తోడుగా నిలిచింది. ఎన్.ఐ.టి.లో తరగతులకు హాజరవుతూనే.. తనకు తెలిసిన విద్యల్లో పిల్లలకు మెళకువలు నేర్పుతోంది. చిన్నవయసులో అన్ని బాధ్యతలెలా అన్ని అడిగితే.. సమస్యలు వస్తేనే కదా జీవితపాఠాలు తెలుస్తాయ్ అంటోంది వెన్నెల. ఆత్మవిశ్వాసం పెరగడానికి, కఠిన పరిస్థితులను ఎదుర్కోవడానికి.. మార్షల్ ఆర్ట్స్ ఎంతో సాయపడిందని చెబుతోంది.
ఉదయం నాలుగు గంటల నుంచి నా దినచర్య మొదలవుతుంది. యోగా, తర్వాత మార్షల్ ఆర్ట్స్ తరగతులు నిర్వహిస్తా. ఆపై కళాశాల తరగతులకు హాజరవుతా. సాయంత్రం కాలేజీ అయ్యాక 8 గంటల వరకు మళ్లీ శిక్షణ ఇస్తా. అది అయ్యాక నా చదువు. ఇదే నా దినచర్య. అలాగని నా సాధనను పక్కన పెట్టలేదు. రోజూ దానికీ సమయాన్ని కేటాయిస్తా. కొత్త టెక్నిక్‌లను ప్రయత్నిస్తా. మార్షల్ ఆర్ట్స్‌లో నాకు చాలామంది గురువులు ఉన్నారు. వారి నుంచి ఎప్పటికప్పుడు సూచనలు తీసుకుంటా. అయిదేళ్ల నుంచి కత్తిసాము, కర్రసాములను సాధన చేస్తున్నా. మా పూర్వీకుల మూలాలు తమిళనాడులో ఉన్నాయి. అందుకే వీటిపైౖ మక్కువ ఏర్పడిందేమో అనిపిస్తుంటుంది.