తెలంగాణ

telangana

ETV Bharat / city

"నీ ఫోన్ నంబర్ లో 5 ఉందిగా.. నీకు జాబ్ లేదు పో!" (డేయ్.. ఎన్నడా ఇదీ..?) - etv bharat

"మీకు అప్పు ఎక్కువగా ఉందా..? అయితే.. జిల్లేడు చెట్టుకు బల్లి తోకను కట్టండి. మీ దరిద్రం మొత్తం తీరిపోద్ది" "దాల్చిన చెక్కను తీసుకెళ్లి బీరువాలో ఓ మూలన పెట్టండి చాలు.. బీరువా మొత్తం నోట్ల కట్టలతో నిండిపోద్ది" ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన.. ఇద్దరు ఉద్దండ పిండాల సూక్తిమూక్తావళి ఇది. ఇలాంటి ముచ్చట్లు చెప్పే జ్యోతిష్య శిఖామణులకు.. వారిని కళ్లు మూసుకొని ఫాలో అయిపోయే.. శిష్య పరమాణువులకు.. మన దగ్గర కొదవే లేదు! అయితే.. ఇలాంటి మూఢత్వంలో ముక్కుమూసుకొని మునకలు వేస్తున్న జనాలు ఇక్కడే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. మన పొరుగుదేశం చైనాలో ఓ అప్రాచ్యపు మేనేజరు తీసుకున్న.. పింజారీ నిర్ణయం వైరల్ అయ్యింది. మరి, ఆ బాగోతం ఏంటో మీరూ చూసేయండి.

5
5

By

Published : Sep 17, 2022, 7:45 PM IST

Updated : Sep 17, 2022, 8:10 PM IST

"బాబా సోమ్ దేవ్ స్వామీజీ నాస్తిక సమాజం" అని పేరు పెట్టుకుంటే ఎలా ఉంటుంది? జనాలు ముక్కుమీద వేలు వేసుకొని.. ఈ నామకరణం మీద రెండు సెటైర్లు వేసి పోతారు. చైనాలో సరిగ్గా.. ఈ ఉదాహరణకు సరిపోయే దిక్కుమాలిన పని ఒకటి చేశాడు ఓ మేనేజరు. ఆయన తీరుపై.. సెటైర్లు రిటైర్ కాకుండా దూసుకొస్తూనే ఉన్నాయి. ఇంతకీ.. ఎవరతను? ఏం చేశాడు??

చైనాలోని గ్వాంగ్‌ డాంగ్‌ ప్రావిన్స్ పరిధిలోని.. షెన్‌జెన్‌ నగరంలో ఒక విద్యా సంస్థ ఉంది. ఎక్కడైనా.. ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్ ప్రాథమిక విధి ఏంటి..? మూఢ విశ్వాసాలను దాటి ఆలోచించే పరిజ్ఞానాన్ని పెంచడం.. హేతుబద్ధమైన తర్కాన్ని అలవర్చడం.. కానీ ఈ చైనా విద్యాసంస్థ మేనేజరు మూఢ నమ్మకాలను అత్యంత గుడ్డిగా విశ్వసించడమే కాకుండా.. అతగాడి నమ్మకాలకు ఇతరుల జీవితాలను సైతం బలిపెట్టడం గమనార్హం.

ఆ సంస్థలో ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానించారు. చాలా మంది అప్లై చేసుకున్నారు. ఇప్పుడు.. వారికి ఉద్యోగం ఇవ్వాలా? వద్దా? అని నిర్ణయించడానికి దేన్ని ప్రామాణికంగా తీసుకుంటారు? ఎక్కడైనా సరే.. అభ్యర్థి టాలెంట్ కు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. ఆ తర్వాత బిహేవియర్ ను పరిగణనలోకి తీసుకుంటారు. ఇవి రెండూ ఓకే అనుకుంటే.. ఉద్యోగం ఇచ్చేస్తారు. ఏ సంస్థ అయినా.. ఇంచుమించు ఇదే పద్ధతి అనుసరిస్తారు. కానీ.. ఈ చైనా మేనేజరు.. వీటన్నింటికన్నా ఓ మూఢ నమ్మకానికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చాడు. అంతేకాదు.. ఆ పని చేయకపోతే ఉద్యోగం కూడా ఉండదని షరతు విధించాడు.

ఆ షరతు ఏమంటే.. ఉద్యోగంలో చేరబోతున్న వ్యక్తి ఫోన్ నంబర్ లోని అంకెల్లో.. 5వ స్థానంలో నంబర్ 5 ఉండొద్దట! ఈ నంబర్ ఉన్నవారిని ప్రత్యేకంగా పిలిచి.. తమ ఫోన్ నంబర్ మార్చుకోవాలని సూచించాడట. ఒకవేళ మార్చుకోవడం కుదరదంటే.. ఉద్యోగం ఇవ్వడం కూడా కుదరదు పొమ్మన్నాడట సదరు మేనేజరు! ఈ నిర్వాకం చైనాలో వైరల్ అయ్యింది. ప్రధాన మీడియాలో సైతం వార్తగా మారింది.

నంబర్ 5

మరి, ఇంతకీ.. సదరు విద్యాసంస్థ మేనేజరు ఇలా ప్రవర్తించడానికి కారణం ఏంటీ అన్నప్పుడు.. తేలింది ఏమంటే అతగాడికి ఒంటి నిండా జాతకాల పిచ్చేనట! సంఖ్యా శాస్త్రాన్ని దాటు కాలు కూడా బయట పెట్టడట! మరి, ఏ స్వామీజీ చెప్పాడో తెలియదు గానీ.. ఫోన్ నంబర్ లోని ఐదో స్థానంలో నంబర్ 5 ఉన్న వారిని ఉద్యోగంలోకీ తీసుకోకూడదని నిర్ణయించుకున్నాడట. ఒకవేళ అలాంటి నంబర్ ఉన్న వ్యక్తికి ఉద్యోగం ఇస్తే.. అతను ఇన్ ఛార్జులతో గొడవ పడతాడట. అంతేకాదు.. యాజమాన్యాన్ని దురదృష్టం కూడా వెంటాడుతుందట! ఈ విషయాలు బలంగా నమ్మిన మేనేజరు.. ఆ 5 నంబరుగాళ్లకు ఉద్యోగం ఇవ్వడం ఎందుకు.. నా సీటు కిందికి నీళ్లు తెచ్చుకోవడం ఎందుకు.. అనుకున్నాడో ఏమో..? అలాంటి ఫోన్ నంబర్ ఉన్నవారందరికీ ఉద్యోగం లేదు పొమ్మన్నాడట. ఎందుకొచ్చిన తంటా అనుకొని కొందరు ఫోన్ నంబర్ మార్చుకొని ఉద్యోగంలో చేరారు. ఇలాంటి తలతిక్క వాడిదగ్గర ఉద్యోగంలో చేరితే.. తర్వాత నుంచి ఇంకెలాంటి పనికిమాలిన ముచ్చట్లు చెప్పి.. వేధిస్తాడో అనుకున్నవాళ్లు టాటా చెప్పేసి వెళ్లిపోయారు.

ఈ విషయమై సోషల్ మీడియాలో హాట్ హాట్ గా చర్చ సాగుతోంది. నెటిజన్లు ఆ మేనేజర్ ను ఓ ఆటాడుకుంటున్నారు. ఇంత సిల్లీ రిక్రూట్ మెంట్ విధానాన్ని ఇంతవరకూ చూడలేదని ఎగతాళి చేస్తున్నారు. "ఇది.. 21వ శతాబ్దం. ఇంకా అలాంటి మూఢనమ్మకాలను పాటించే వాళ్లు బాస్‌ స్థానంలో కూర్చుంటే పరిస్థితి ఇలాగే ఉంటుంది" అని మండి పడుతున్నారు. "నమ్మకాలు వ్యక్తిగతంగా ఉన్నంత వరకూ ఇబ్బంది లేదు.. కానీ.. అవి వ్యవస్థలోకి చొరబడి.. ఇతరుల జీవితాలకు కష్టం కలిగిస్తే మాత్రం సరికాదు" అని సూచిస్తున్నారు.

వీటిపైనా ఓ క్లిక్కేయండి..

Last Updated : Sep 17, 2022, 8:10 PM IST

ABOUT THE AUTHOR

...view details