రాష్ట్రంలో కొత్తగా 983 కరోనా కేసులు.. 11 మంది మృతి
09:10 August 03
రాష్ట్రంలో కొత్తగా 983 కరోనా కేసులు.. 11 మంది మృతి
రాష్ట్రంలో కొత్తగా 983 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 67,660కు చేరింది. మరో 11 మంది మహమ్మారికి బలయ్యారు. ఈ మరణాలతో కలిపి మొత్తం మృతుల సంఖ్య 551కు చేరింది. తాజాగా 1,019 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా... ఇప్పటివరకు 48,609 మంది వైరస్‌ను జయించారు. ప్రస్తుతం 18,500 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 9,443 శాంపిళ్లను పరీక్షించినట్లు వైద్యా ఆరోగ్యశాఖ పేర్కొంది. మరో 1,414 మంది వైరస్ పరీక్షల ఫలితాలు రావాల్సి ఉందని తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 4,87,238 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశామని ప్రకటించింది.
జిల్లాల్లోనూ తక్కువ కేసులు
జీహెచ్ఎంసీ సహా ఇతర జిల్లాల్లోనూ గత పది రోజులతో పోలిస్తే చాలా తక్కువ సంఖ్యలో ఇవాళ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. జీహెచ్ఎంసీ పరిధిలోనే 273 కేసులు నమోదయ్యాయి. రాజధాని చుట్టుపక్కల జిల్లాలైన రంగారెడ్డిలో 73, మేడ్చల్ మల్కాజిగిరి 48, సంగారెడ్డి జిల్లాలో 37 కేసులు వెలుగుచూశాయి. వారం రోజులుగా వైరస్ విజృంభిస్తోన్న వరంగల్ అర్బన్ జిల్లాలో 57, కరీంనగర్లో 54, పెద్దపల్లిలో 44, నిజామాబాద్లో 42 మందికి వైరస్ సోకింది. నాగర్ కర్నూల్లో 32, వనపర్తిలో 26, వరంగల్ రూరల్లో 25, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 20 కేసులు నమోదయ్యాయి. మిగిలిన అన్ని జిల్లాల్లోనూ 20లోపే కరోనా కేసులు వెలుగుచూశాయి.
దేశ సగటుకన్న చాలా తక్కువ
రాష్ట్రంలో కరోనా బాధితుల్లో 71.8 శాతం మంది వైరస్ నుంచి కోలుకుంటున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. హోం ఐసోలేషన్‌లో ఉన్న 84 శాతం కేసుల్లో ఎలాంటి వైరస్ లక్షణాలు లేవని పేర్కొంది. మరణాల రేటు దేశ సగటు కన్నా తక్కువగా.. కేవలం 0.81 శాతంగా ఉన్నట్లు ప్రకటించింది. ఆసుపత్రుల్లో ఐసోలేషన్, ఆక్సిజన్, ఐసీయూ పడకలతో కలిపి 17,081కి గాను 14,571 పడకలు ఖాళీగా అందుబాటులో ఉన్నాయని వెల్లడించింది.