ఏటా వేసవి.. పెళ్లిళ్లకు మంచి సీజన్. ముహూర్తాలు అధికంగా ఉంటాయి. 2020, 21లలో కరోనా ఉద్ధృతితో ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ప్రభుత్వం ఆంక్షలు అమలుచేసింది. పరిమిత సంఖ్యలో బంధుగణం మధ్య వేడుకలు చేసుకునేందుకు అనుమతించింది. ఈ నేపథ్యంలో తక్కువ మంది సమక్షంలో చేసుకోవడం ఇష్టంలేక.. అంగరంగ వైభవంగా, భారీఎత్తున చేసే అవకాశం లేక కొందరు వివాహాలు వాయిదా వేసుకున్నారు. ప్రస్తుతం ఆంక్షలు లేకపోవడం.. చైత్ర, వైశాఖ మాసాల్లో బలమైన ముహూర్తాలు ఉండడంతో ఎక్కువ మంది ఈ సారి ఘన వేడుకలకు సిద్ధమవుతున్నారు. శ్రీరామనవమి తర్వాత నుంచి మే 25 వరకు మంచి ముహూర్తాలు ఉన్నాయి. జూన్‌లోనూ కొన్ని ముహూర్తాలున్నా.. అవి తక్కువే ఈ క్రమంలో ఏప్రిల్, మేలలో తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 90 వేల వివాహ వేడుకలు జరగనున్నాయని.. ఒక్క హైదరాబాద్‌లోనే సుమారు 35 వేల పెళ్లిళ్లకు బాజాలు మోగనున్నట్లు పురోహితులు, ఫంక్షన్‌హాళ్ల ప్రతినిధులు చెబుతున్నారు. పలు గ్రామాల్లోని ఫంక్షన్‌హాళ్లలో రోజుకు రెండు చొప్పున శుభకార్యక్రమాలు బుక్ అయినట్టు పేర్కొంటున్నారు.
అంగరంగ వైభవంగా..:హైదరాబాద్‌లో కొన్ని జంటలు రూ.కోట్లు వెచ్చించి పెళ్లి వేడుకలు నిర్వహించుకునేందుకు సిద్ధమవుతున్నాయి. కొందరు నగరంలోని ప్రఖ్యాత హోటళ్లలో గదులు, హాళ్లను బుక్ చేసుకుంటుండగా.. మరికొందరు శివార్లలోని రిసార్టుల్ని వేదికగా చేసుకుంటున్నారు. రిసార్టుల్ని మూడు నుంచి ఆరు రోజుల కోసం రిజర్వు చేసుకుంటున్నారు. దేశ, విదేశాల్లో ‘డెస్టినేషన్ వెడ్డింగ్’కు సిద్ధమవుతున్నావారూ ఉన్నారు. వాటికి కుటుంబ సభ్యులతో పాటు బంధువుల్ని తరలించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరోవైపు హోటళ్లు, ఫంక్షన్ హాళ్లముందస్తు బుకింగ్‌కు జనం పెద్దఎత్తున సంప్రదిస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ఫంక్షన్ హాళ్లకు ఏప్రిల్‌కు సంబంధించిన బుకింగ్‌లు మార్చి రెండో వారంలోనే పూర్తయ్యాయి. కొన్ని హాళ్లలో ఉదయం పెళ్లి, సాయంత్రం రిసెప్షన్‌కు బుకింగ్ తీసుకుంటున్నాయి. సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లోని హాళ్లలో రోజుకు ఒక్కవేడుక మాత్రమే జరుగుతుంది. ఈ సారి మాత్రం రెండు వేడుకల బుకింగ్‌లు అయినట్లు నిర్వాహకులు చెబుతున్నారు.
20 రంగాల కార్మికులకు ఉపాధి..:పెళ్లంటే ఎంతో సందడే కాదు.. వివిధ రంగాల వారికి ఉపాధినిచ్చే పండగ. నిశ్చితార్థం పూర్తయిందంటే చాలు.. పెళ్లి పత్రికలు అచ్చేయడం, కొత్త వస్త్రాల కొనుగోలు, ఫంక్షన్‌హాల్, ఫొటో, వీడియో గ్రాఫర్లు, రంగురంగుల పూలతో మండపాన్ని సిద్ధం చేసే కార్మికులు(డెకరేషన్), టెంట్‌హౌస్ నిర్వాహకులు, దర్జీలు, బ్యాండు, పురోహితులు, మేకప్, బంగారు వ్యాపారులు, ఇళ్లను విద్యుద్దీపాలతో అలంకరించేవారు, క్యాటరింగ్ సహా దాదాపు 20 రంగాలకు చెందినవారు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతారు. ఈ సమయంలో వారికి చేతినిండా పనిదొరుకుతుంది. గత రెండేళ్లుగా వివాహాలు పెద్దగా జరగక ఆయారంగాలవారు నష్టపోయారు. ఈసారి పెద్ద సంఖ్యలో జరగనుండడంతో కార్మికుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. ఈ సారి ప్రీ వెడ్డింగ్ షూట్స్‌తోనే రెండేళ్ల నష్టం భర్తీ అయ్యేట్టుఉందని ఫొటోగ్రాఫర్ దినకర్ తెలిపారు.