రాష్ట్రంలో కార్పొరేషన్లు, సొసైటీల్లోనూ ఉద్యోగ నియామకాలకు ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రభుత్వరంగ సంస్థలు, సొసైటీలు 190కిపైగా ఉన్నాయి. వీటిలో భారీగా ఉద్యోగాల ఖాళీలున్నాయి. చాలా ఏళ్లుగా కార్పొరేషన్లు, సొసైటీల్లో ఉద్యోగాలు భర్తీ కావడం లేదు. పదవీ విరమణలతో ఉద్యోగాలు ఖాళీ అవుతున్నా... వాటి స్థానంలో నియామకాలు జరగడం లేదు. అన్ని కార్పొరేషన్లలో కలిసి 8వేల920కిపైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రాథమిక సమాచారం. మరోవైపు కొన్ని సంస్థలు, సొసైటీల అధికారులు, ఉద్యోగులు డిప్యుటేషన్‌పై ఇతర శాఖల్లో పనిచేస్తున్నారు. సంస్థల్లో ఉద్యోగుల లోటు ఉన్నా ప్రభుత్వపరంగా ఖాళీలు భర్తీ కావడం లేదు. ఖాళీల వల్ల ఆయా సంస్థల్లో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగాల భర్తీకి నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రభుత్వం... వివిధ శాఖలతోపాటు కార్పొరేషన్లు, సొసైటీల పరిధిలోని ఉద్యోగాలను సైతం భర్తీ చేస్తున్నట్లు సమాచారం ఇచ్చింది. ఆయా శాఖలు విధిగా తమ పరిధిలోని అన్ని కార్పొరేషన్లు, సొసైటీల నుంచి సమాచారం తీసుకొని ప్రభుత్వానికి నివేదించాలని సూచించింది.
మరో 9 వేల పోస్టుల భర్తీ... కార్పొరేషన్లు, సొసైటీల్లోనూ నియామకాలు...!
రాష్ట్రంలోని ప్రభుత్వశాఖలతోపాటు ప్రభుత్వ రంగ సంస్థల్లోని ఖాళీలను సైతం భర్తీ చేయాలని సర్కారు నిర్ణయించింది. కార్పొరేషన్లు, సొసైటీల్లోనూ ఉద్యోగ నియామకాలకు చర్యలు చేపట్టింది. దీంతో భర్తీ చేయనున్న ఉద్యోగాల సంఖ్య మరో తొమ్మిది వేల మేరకు పెరిగే అవకాశం ఉంది. వైద్య ఆరోగ్యశాఖలో గతంలో ప్రకటించిన వాటితోపాటు మరో వెయ్యి పోస్టులు కలిపి భర్తీకి సన్నాహాలు చేస్తున్నారు.
మరోవైపు వైద్య ఆరోగ్యశాఖలో పెద్ద ఎత్తున పోస్టులను భర్తీ చేసేందుకు కసరత్తు మొదలైంది. గతంలో ప్రకటించిన వాటితోపాటు మరో వెయ్యి కలిపి 3వేల298 పోస్టులను భర్తీ చేసేందుకు నియామకాల ప్రక్రియపై ఉన్నత స్థాయిలో గురువారం చర్చించారు. వాస్తవంగా 12వేల 289 పోస్టులను గతంలోనే ముఖ్యమంత్రి మంజూరు చేసి 9వేల 381 పోస్టుల నియామకానికి అనుమతులు ఇచ్చారు. ఇప్పటికే 2వేల 272 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. ప్రస్తుతం 4వేల811 భర్తీ ప్రక్రియలో ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇంకా 2వేల 298 భర్తీ చేయాల్సి ఉంది. వీటిలో 275 వైద్యులు, 957 నర్సులు, వెయ్యి 11 పారా మెడికల్ పోస్టులున్నట్లు పేర్కొంటున్నారు. మరో వెయ్యి పోస్టుల భర్తీకి సన్నాహాలు చేస్తున్నారు. వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోని పోస్టుల భర్తీకి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు-ఎంఎచ్ఆర్బీ సిద్ధమవుతోంది.