ఏపీ మైనార్టీ, సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా పనిచేస్తున్న గంధం చంద్రుడు కుమారుడు భువన్ జై ఎనిమిదేళ్ల వయసులోనే యూరప్ ఖండంలోనే అత్యంత ఎత్తైన ఎల్బ్రస్ శిఖరాన్ని అధిరోహించి ఔరా! అనిపించాడు. ఐదేళ్ల బాలిక.... కిలిమంజారో పర్వతాన్ని ఎక్కిన వార్తను టీవీలో చూశాడు భువన్. ఆ క్షణమే తానూ అత్యంత ఎత్తైన పర్వతాలను అధిరోహించాలని నిర్ణయించున్నాడు. ఇదే విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాడు. చిన్నారిలోని ఆసక్తిని, ధైర్యాన్ని గుర్తించి శిక్షణ ఇప్పించేందుకు వారూ ఒప్పుకున్నారు. మంచులో ఎత్తైన పర్వతాలను అధిరోహించటం అత్యంత తేలికైన విషయం కాదు. ఎంతో కఠోర శిక్షణ, ఆరోగ్యంగా ఉంటే తప్ప వాటిని ఎక్కలేరు. అలాంటి ఈ చిన్నారి క్లిష్ట వాతావరణాన్ని ఎదుర్కొనేలా సంసిద్ధుడై... పర్వతారోహణ చేసి మెరుగైన ప్రతిభను కనబరిచాడు.
ప్రస్తుతం మూడో తరగతి చదువుతున్న భువన్.. పర్వతాన్ని అధిరోహించేందుకు అనేక ప్రాంతాల్లో శిక్షణ తీసుకున్నాడు. భయపడకుండా ఎత్తైన కొండలు ఎక్కడంపై అనంతపురం, గండికోట, తెలంగాణ భువనగిరిలో తర్ఫీదు పొందాడు. మంచును తట్టుకునేలా లద్దాఖ్‌లో శిక్షణ తీసుకున్నాడు. 5నెలల కఠోర సాధన అనంతరం.... సెప్టెంబర్ 11న... తన బృందంతో కలిసి రష్యాకు వెళ్లాడు. 12న టెర్స్ కోల్‌లోని మౌంట్ ఎల్బ్రస్ బేస్‌కు వెళ్లిన ఆ బృందం...... 13 వ తేదీన 3 వేల 500 మీటర్లు అధిరోహించి తిరిగి బేస్ క్యాంప్‌కు చేరుకుంది. అక్కడ కొంత శిక్షణ అనంతరం 18న... 5 వేల 642 మీటర్ల ఎత్తైన ఎల్బ్రస్ పర్వత శిఖరానికి చేరుకొని రికార్డు నెలకొల్పాడు.