తెలంగాణ

telangana

ETV Bharat / city

8 నెలల గర్భిణీ... 15 కిలోల బరువు... 5 కిలోమీటర్ల ప్రయాణం..! - latest news of vishaka manyam

ఎనిమిది నెలల గర్భిణీ... కిలోమీటర్ల మేర బరువులు మోయడం ఎక్కడైనా చూశారా..? ఏమాత్రం ఇబ్బంది పడకుండా తోటి మహిళలతో కలిసి... ఆనందంగా, అలవోకగా పనులు చేసుకునే వారి గురించి ఎప్పుడైనా విన్నారా..? రవాణా సౌకర్యం లేని దుస్థితి ఓవైపు... పని చేయక తప్పని కుటుంబ పరిస్థితి మరోవైపు... ఏపీలోని విశాఖ మన్యంలో ఓ నిండు గర్భిణీ... 5 కిలోమీటర్ల మేర బరువులు మోస్తూ... కుటుంబానికి ఆసరాగా నిలుస్తోంది.

8 నెలల గర్భిణీ... 15 కిలోల బరువు... 5 కిలోమీటర్ల ప్రయాణం..!

By

Published : Nov 17, 2019, 7:46 PM IST

8 నెలల గర్భిణీ... 15 కిలోల బరువు... 5 కిలోమీటర్ల ప్రయాణం..!

సాధారణంగా గర్భిణులు సొంత పనులు చేసుకునేందుకు కూడా ఇబ్బంది పడుతుంటారు. వాంతులు, వికారం అంటూ అస్వస్థతకు గురవుతుంటారు. కానీ... విశాఖ మన్యంలో... 8 నెలల గర్భిణీ చేసే సాహసం ఔరా అనిపిస్తోంది.

ఆమె పేరు అరుణ. స్వస్థలం పాడేరు మండలం బరిసింగి. పాడేరు సమీపంలోని కొండపై 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మరో నెలలో ప్రసవించనున్న అరుణ... నిత్యం ఇంటి, పొలం పనులు చేసుకుంటోంది. బరిసింగి నుంచి పాడేరు వరకూ ఘాట్ రోడ్డుపై 15 కిలోల బరువున్న బంతిపూల గంపలు మోసుకుంటూ వెళ్తోంది. ఏకబిగిన 5 కిలోమీటర్ల దూరం నడుస్తోంది.

అరుణ స్పందన ఏమిటో తెలుసా..?

ఇప్పటికే మీకు ముగ్గురు సంతానం. మరో నెలలో నాలుగో బిడ్డకు జన్మనిస్తావు కదా... ప్రతికూల పరిస్థితుల్లో ఎందుకిలా బరువులు మోస్తున్నావని ప్రశ్నిస్తే... తన పని తాను చేసుకుంటే సులభ ప్రసవం అవుతుందని అంటోంది అరుణ. గతంలో ప్రసవాల సమయంలోనూ... ఎలాంటి శస్త్ర చికిత్సలు జరగలేదని చెప్పింది.

ఇలాంటి పరిస్థితుల్లోనూ కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్న అరుణను... స్థానికులు మెచ్చుకుంటున్నారు. తమ గ్రామానికి కనీసం ఆటోలు వెళ్లేందుకు రోడ్డు లేదని... రహదారి సౌకర్యం కల్పిస్తే నడక బాధ తప్పుతుందని చెబుతున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details