కరోనా టీకా రెండు డోసులు పొందిన వారిలో 79% మందికి యాంటీబాడీలు వృద్ధి చెందాయి. అసలు టీకాలు పొందని సాధారణ జనాభాలో సుమారు 59.5% మందికి యాంటీబాడీలు పెరిగాయి. వీరు పట్టణ ప్రాంతాల్లో 63.5%, రూరల్‌లో 56.38% మంది ఉన్నారు. ఏపీలో వైద్య ఆరోగ్యశాఖ నిర్వహించిన నాలుగో సీరో సర్వేలో ఈ విషయం వెల్లడైంది. టీకా రెండు డోసులు వేసుకున్న వారిలో వైద్యులు, ఆరోగ్య సిబ్బంది (కేటగిరి-1), పోలీసు, అంగన్‌వాడీ (కేటగిరి-2), రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖ ఉద్యోగుల(కేటగిరి-3) నుంచి నమూనాలు సేకరించారు.
ఏపీలో కరోనా కేసుల నమోదు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు వైద్య ఆరోగ్య శాఖ 4సార్లు సీరో సర్వైలెన్స్ నిర్వహించింది. వైరస్ ప్రభావం ఎలా ఉంది? ప్రజల్లో యాంటీబాడీలు వృద్ధి చెందుతున్నాయా? లేదా? తెలుసుకొనేందుకు ఈ సర్వైలెన్స్‌ను దశల వారీగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా ఈ ఏడాది ఏప్రిల్ 9 నుంచి 16వ తేదీ మధ్య ఒక్కో జిల్లాలో 4,200 మంది చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 54,600 మంది నుంచి రక్త నమూనాలు సేకరించింది. రక్త నమూనాలు ఇచ్చిన వారిలో రెండు టీకాలు పొందిన వారు, అసలు టీకాలు వేయించుకోని వారు ఉన్నారు. వీరిచ్చిన రక్త నమూనాలను పరీక్షించి యాంటీబాడీలు వృద్ధి ఎలా ఉందో వైద్య ఆరోగ్య శాఖ విశ్లేషించింది. వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభించిన కొద్దిరోజులకే ఈ నమూనాల సేకరణ జరిగింది. రెండు డోసుల టీకాలు పొందిన వారిలో మొత్తం 7,800 మంది నుంచి రక్త నమూనాలు సేకరించి పరీక్షించారు. వీటి ఫలితాల ప్రకారం వందకు 79% మందికి యాంటీబాడీలు వృద్ధి చెందినట్లు వెల్లడైంది. టీకాలు పొందని వారిలో (జనరల్ పాపులేషన్) 46,800 నుంచి రక్త నమూనాలు సేకరించి పరీక్షించారు.