రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా వృద్ధాప్య పింఛన్ల కోసం(ఆసరా(Aasara pension)) 7.3 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఆసరా పింఛన్లు పొందేందుకు అర్హత వయసు 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గించిన ప్రభుత్వం ఆగస్టు 31 గడువుగా దరఖాస్తుల్ని స్వీకరించింది. గ్రామాలు, మున్సిపాలిటీలు, నగరాల్లో అర్హులైన లబ్ధిదారులు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. రెండేళ్ల క్రితం ఓటర్ల జాబితా మేరకు క్షేత్రస్థాయిలో 57 ఏళ్లు నిండిన వారిని గుర్తించేందుకు సర్వే చేయగా దాదాపు 8 లక్షలకు పైగా అర్హులు ఉన్నట్లు వెల్లడైంది. తాజాగా దరఖాస్తులు స్వీకరించగా 7.3 లక్షలకు పరిమితమైంది.
దరఖాస్తు ప్రక్రియ ముగియడంతో క్షేత్రస్థాయి పరిశీలనకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సమాయత్తమవుతోంది. అర్హులైన అందరికి పింఛన్లు(Aasara pension) లభించేలా చర్యలు తీసుకోవడంతో పాటు అనర్హులను తొలగించేందుకు చర్యలు చేపట్టనుంది. అర్హత కలిగిన ఒక కుటుంబసభ్యుడికి తప్పనిసరి పింఛను మంజూరు చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా ఆహార భద్రతాకార్డు, సామాజిక భద్రత, కుటుంబసర్వే తదితర వివరాలతో ప్రాథమిక పరిశీలన చేయనుంది. అనంతరం జీహెచ్‌ఎంసీ పరిధిలో రెవెన్యూ అధికారులు, గ్రామ పంచాయతీల పరిధిలో పంచాయతీ సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలన చేయనున్నారు. ఈ పరిశీలనలో దరఖాస్తుదారుడి కుటుంబం, ఆదాయం, కుటుంబసభ్యుల వివరాలు, ఉద్యోగులుగా ఎంత మంది ఉన్నారు? సొంతిళ్లు, వాహనాలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోనున్నారు. ఆసరా పింఛన్ల మంజూరు కోసం ఇప్పటికే నిర్దేశించిన మార్గదర్శకాలకు లోబడి ఉంటే ఆసరాపింఛను మంజూరు చేయడం లేదా తిరస్కరించడంపై సెర్ప్ నిర్ణయం తీసుకోనుంది.