తెలంగాణ

telangana

ETV Bharat / city

'డబుల్​' లబ్ధిదారుల ఎంపికకు జిల్లాస్థాయి కమిటీలు

రాష్ట్రంలో ఇళ్లు లేని బలహీనవర్గాల కుటుంబాల కోసం చేపట్టిన గృహనిర్మాణ పథకంలో 52,456 గృహాల నిర్మాణం పూర్తయ్యింది. వీటిలో ఇప్పటివరకు 10,550 గృహాల్ని లబ్ధిదారులకు అందించారు. నగరాలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలకు కలిపి 2,86,057 ఇళ్లు మంజూరు కాగా.. అందులో 2,66,068 ఇళ్లకు పరిపాలన అనుమతులు ఇచ్చారు. వీటిలో 2.21 లక్షల ఇళ్లకు టెండర్లు ఖరారుచేసి పనులు మొదలుపెట్టారు. శాసనసభ సమావేశాల నేపథ్యంలో గృహ నిర్మాణశాఖ ఈ వివరాలు వెల్లడించింది.

52456-two-bedroom-houses-completed-in-telangana-till-now
'డబుల్​' లబ్ధిదారుల ఎంపికకు జిల్లాస్థాయి కమిటీలు

By

Published : Mar 25, 2021, 6:33 AM IST

Updated : Mar 25, 2021, 6:39 AM IST

ఈ ఆర్థిక సంవత్సరం (2021-22) బడ్జెట్‌లో రెండు పడకగదుల ఇళ్లకు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ.11 వేల కోట్ల నిధులు కేటాయించింది. ఇందులో ప్రగతిపద్దు కింద రూ.7,219.70 కోట్లు..ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి ఫండ్‌ కింద రూ.3,780.30 కోట్లు..కేంద్ర ప్రభుత్వ పథకం పీఎంఏవై గ్రామీణ, పీఎంఏవై పట్టణ పథకాల కింద రూ.125 కోట్లు రానున్నట్లు ప్రభుత్వం చూపించింది. ఈ రూ.11 వేల కోట్ల నిధుల్ని ఇప్పటికే మంజూరై నిర్మాణంలో ఉన్న గృహాల్ని పూర్తిచేయడానికి, అదేవిధంగా సొంత స్థలాల్లో కట్టుకునే ఇళ్లకు ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సహకారానికి వినియోగించనున్నట్లు గృహనిర్మాణశాఖ పేర్కొంది.

ఏ దశలో... ఎన్ని ఇళ్లు

ఇప్పటివరకు రూ.10,054.49 కోట్లు ఖర్చు చేసినట్లు గృహనిర్మాణ శాఖ వెల్లడించింది. 2021 మార్చి 15 నాటికి రెండు పడకగదుల ఇళ్ల స్థితి ఇలా ఉంది..

  • మంజూరైన ఇళ్లు: 2,86,057
  • అంచనా విలువ: రూ.18,808.90 కోట్లు
  • నిర్మాణం పూర్తయిన ఇళ్ల సంఖ్య: 52,456
  • 90 శాతం నిర్మాణం పూర్తయిన ఇళ్లు: 1,02,893
  • వివిధ నిర్మాణ దశల్లో ఉన్నవి: 65,685
  • పరిపాలన అనుమతులు పొంది, పనులు మొదలుకానివి: 45,034
  • పరిపాలన అనుమతులు రావల్సిన ఇళ్ల సంఖ్య: 19,989

నిధుల ఖర్చులో ఎవరెంత?

  • రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి: రూ.8,742.99 కోట్లు
  • కేంద్ర ప్రభుత్వ నిధుల నుంచి: రూ.1,311.50 కోట్లు

లబ్ధిదారుల ఎంపికకు ప్రత్యేక కమిటీ

రెండు పడకగదుల ఇళ్లకు లబ్ధిదారుల్ని ఎంపిక చేసేందుకు జిల్లాస్థాయిలో కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు గృహనిర్మాణశాఖ వెల్లడించింది. జిల్లా మంత్రి అధ్యక్షతన జిల్లాలోని ఎమ్మెల్యేలతో జిల్లాస్థాయి కమిటీ ఏర్పాటవుతుంది. ఈ పథకం అమలుకు జిల్లా కలెక్టర్‌ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. జీహెచ్‌ఎంసీని ఒక యూనిట్‌గా తీసుకోనున్నారు. ఇందులో ఆ జిల్లా కలెక్టర్‌, కమిషనర్‌, ఎమ్మెల్యేలు ఉంటారు.

ఒక్కో శాసనసభ నియోజకవర్గంలో గ్రామాలు, మున్సిపాల్టీల వారీగా ఇళ్లు కేటాయిస్తారు. ఈ సంఖ్యను జిల్లా కమిటీ నిర్ణయిస్తుంది.

మహిళల పేరుతో మంజూరు

రెండు పడక గదుల ఇంటిని కుటుంబంలో భార్య పేరు మీద మంజూరు చేయనున్నారు. లబ్ధిదారులు పైసా కట్టక్కర్లేదని..100 శాతం నిర్మాణవ్యయం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఖర్చుచేస్తున్నట్లు మంగళవారం శాసనసభలో తన ప్రసంగం సందర్భంగా గృహనిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రకటించారు. రెండు పడకగదుల ఇంట్లో 560 చదరపు అడుగుల విస్తీర్ణంతో రెండు పడకగదులు, హాలు, వంటగది, రెండు టాయిలెట్లు ఉంటాయని..పిల్లర్లు, మెట్లతో కూడిన నిర్మాణం భవిష్యత్తులో ఇంటిని విస్తరించడానికీ అవకాశం కల్పిస్తున్నట్లు వివరించారు. జీహెచ్‌ఎంసీలో ఫ్లాట్లు నిర్మిస్తున్నారు.

Last Updated : Mar 25, 2021, 6:39 AM IST

ABOUT THE AUTHOR

...view details