రాష్ట్ర రెవెన్యూ శాఖలో కొత్త రక్తం చేరనుంది. 524 మంది నూతన ఉద్యోగులను నియమించేందుకు రాష్ట్ర సర్కార్ ప్రకటన జారీ చేసింది. టీఎస్‌పీఎస్సీ ద్వారా 2017లో రెవెన్యూ శాఖకు ఎంపికైన 217 మంది జూనియర్ అసిస్టెంట్లు, 292 మంది టైపిస్టులు, 15 మంది జూనియర్ స్టెనోలను జిల్లాలకు కేటాయించనున్నారు. వీటిపై సోమవారం అన్ని జిల్లాల కలెక్టరేట్ల పరిపాలన అధికారులతో (ఏవో) సమావేశం నిర్వహించనున్నారు. ఉద్యోగాలకు ఎంపికైన వారికి సంబంధించిన ఉత్తర్వుల ప్రతులను ఏవోలకు అందజేస్తారు. ఒకటి రెండు రోజుల్లో జిల్లా కలెక్టర్లు తహసీల్దారు కార్యాలయాలకు వారిని కేటాయించనున్నారు.
రెవెన్యూ శాఖలో 524 మంది కొత్త ఉద్యోగులు..! - telangana revenue department
రెవెన్యూ శాఖలో 524 మంది కొత్త ఉద్యోగులను నియమించేందుకు ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎంపికైన అభ్యర్థులకు పలు క్యాడర్‌లలో నియామక ఉత్తర్వులు ఇచ్చేందుకు భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ).. ప్రక్రియను ప్రారంభించారు.
వీఆర్వోల సర్దుబాటుపై కసరత్తు
రాష్ట్రంలో వీఆర్వో వ్యవస్థ రద్దు అనంతరం జాబ్ చార్ట్ లేకుండా ఉన్న వీఆర్వోలను వివిధ శాఖల్లో సర్దుబాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అక్టోబరు నుంచి వీఆర్వోలు తహసీల్దారు పర్యవేక్షణలో పలు రకాల ప్రభుత్వ పనులు చేపడుతున్నారు. తహసీల్దారు కార్యాలయాల నుంచే జీతాలు పొందుతున్నప్పటికీ ప్రత్యేకంగా విధుల కేటాయింపంటూ లేదు. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్, పురపాలక శాఖలతోపాటు పలు శాఖల నుంచి ప్రభుత్వం ఖాళీల వివరాలను సేకరించింది. అర్హులైన వారిని రెవెన్యూలోనే వారి అర్హతకు సమానమైన పోస్టుల్లో నియమించి మిగిలిన వారిని ఇతర శాఖలకు పంపేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందుతోంది. దాదాపు ఈ నెలాఖరులోగానే సర్దుబాటు పూర్తిచేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.