తెలంగాణ

telangana

ETV Bharat / city

అమరావతి ఉద్యమం.. ఆగని పోరాటం... ఇప్పటికీ అదే మనోధైర్యం.! - రాజధాని అమరావతి వార్తలు

ఒక రోజు.. రెండు రోజులు... నెల... 100 రోజులు... సంవత్సరం...ఇప్పుడు 500వ రోజు. ఇలా రోజులు గడుస్తూనే ఉన్నాయి.కానీ... వారు ఎత్తిన జెండా దించలేదు. దిక్కులు పిక్కటిల్లేలా ఉద్యమ నినాదాన్ని వినిపించడం మానలేదు. ఎన్నో బెదిరింపులు, ఎన్నెన్నో కేసులు, మరెన్నో ఆంక్షలు... అన్నింటినీ భరించారు. పల్లెల్లో ఖాకీ బూట్ల పదఘట్టనలు, లాఠీఛార్జిలు, అర్ధరాత్రి సోదాలు... అన్నింటినీ సహించారు. వానొచ్చినా, వరదొచ్చినా, ఎండలు నిప్పులు చెరుగుతున్నా, కరోనా భూతం కోరలు చాచినా వారిలో మనోధైర్యం చెక్కు చెదరలేదు. పోరాటం ఆగలేదు.

500 days for the Amravati movement
అమరావతి ఉద్యమం

By

Published : Apr 30, 2021, 8:28 AM IST

రాజధాని అమరావతి కోసం అక్కడి ప్రజలు, రైతులు, రైతు కూలీలూ గాంధేయమార్గంలో చేస్తున్న పోరాటం నేటికి 500వ రోజుకి చేరుతోంది...! ఈ సుదీర్ఘ ఉద్యమ ప్రస్థానంలో వారు న్యాయం కోసం, సాయం కోసం తొక్కని గడపలేదు... కలవని రాజకీయ నాయకుడు లేడు... తమ గోడును విన్నవిస్తూ దేశ ప్రధాని మొదలు అనేక మంది నాయకులకు లేఖలు రాశారు. దిల్లీ వెళ్లి కేంద్ర మంత్రుల్ని, వివిధ పార్టీల నాయకుల్ని కలసి మద్దతివ్వాలని అభ్యర్థించారు. తమకిచ్చిన మాట ప్రకారం ఏకైక రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేసేంత వరకు పోరాటం ఆపేది లేదని రాజధాని ప్రజలు, రైతులు స్పష్టంచేస్తున్నారు.

కల చెదిరిపోయిన రోజు
రాజధాని అమరావతిలోనే ఉంటుందని ఎన్నికల ముందు వైకాపా చేసిన ప్రకటనలతో ప్రభుత్వం మారినా ప్రజలు భరోసాగానే ఉన్నారు. కానీ 2019 డిసెంబరు 17న అసెంబ్లీలో సీఎం జగన్‌ చేసిన మూడు రాజధానుల ప్రస్తావన వారికి శరాఘాతమైంది. ఆ మర్నాటి నుంచే అమరావతి పరిరక్షణ ఉద్యమం ప్రారంభించారు. రైతులు, కూలీలు కలసి రైతు ఐకాస ఏర్పాటు చేశారు. రాజధాని గ్రామాలకు వెలుపల వివిధ వర్గాలకు చెందినవారు అమరావతి పరిరక్షణ సమితి పేరిట పోరాటం ప్రారంభించారు. పలువురు ప్రవాసాంధ్రులూ తమకు తోచిన సహాయాన్ని అందజేస్తున్నారు.

అడుగడుగునా నిర్బంధం... ఆంక్షలు
మరావతి పరిరక్షణ ఉద్యమం రాజుకోవడంతో... ప్రభుత్వం వేల సంఖ్యలో పోలీసుల్ని రాజధాని గ్రామాల్లో మోహరించింది. 144 సెక్షన్‌, పోలీసు చట్టంలోని 30 సెక్షన్లను ప్రయోగించింది. ఆంక్షలు, నిర్బంధాలతో భయభ్రాంతుల్ని చేశారు. రోడ్లపై నిరసనలను అడ్డుకున్నారు. అనుమతుల్లేవని బెదిరించారు. రహదారులకు అడ్డుగా ముళ్ల కంచెలనూ వేశారు. ఇళ్లల్లోకి వెళ్లి అర్ధరాత్రి తనిఖీలు చేశారు. 2020 జనవరిలో శాసనసభ ముట్టడికి పెద్ద ఎత్తున రాజధాని ప్రజలు తరలి వచ్చినప్పుడూ పోలీసులు లాఠీలతో విరుచుకుపడ్డారు. దానికి నిరసనగా ఆ మర్నాడు మందడంలో దీక్ష చేస్తున్న మహిళలపైనా లాఠీఛార్జి చేశారు. ఓ గర్భిణిని పోలీసు అధికారి ఒకరు కాలితో తన్నడంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలపై హైకోర్టు జోక్యం చేసుకుని మందలించడంతో, రాజధాని గ్రామాలపై పోలీసుల ఉక్కు పిడికిలిని కొంత సడలించారు. ఇప్పటికీ ఆంక్షలు, నిర్బంధాలు ఏదో ఒక రూపంలో కొనసాగుతూనే ఉన్నాయి. ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్న సుమారు 700-800 మందిపై అట్రాసిటీతోపాటు పలు కేసులు పెట్టారు. వారిలో ఒక్కొక్కరిపై 20-30 కేసులు నమోదయ్యాయి.

అతివలే ఆదిశక్తులై
రాజధాని పరిరక్షణ ఉద్యమంలో మొదటి నుంచీ మహిళలు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. మందడంలో ర్యాలీ తీసినా, దుర్గమ్మకు మొక్కుల చెల్లింపులైనా, అసెంబ్లీ ముట్టడికైనా, జాతీయ రహదారి దిగ్బంధమైనా... మహిళలే ముందున్నారు. పోలీసులు దురుసుగా ప్రవర్తించినా, బూటు కాళ్లతో తన్నినా, లాఠీలతో కొట్టినా, ముళ్ల కంచెలు వేసి ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నా మౌనంగా భరించారు. ఇక్కడి మహిళా ప్రతినిధులు, నాయకురాళ్లు కరోనా సమయంలోనూ దిల్లీకి వెళ్లి... పలువురు కేంద్ర మంత్రులను, వివిధ పార్టీల నాయకులను కలసి మద్దతు కోరారు.

ప్రాణాలతో వెళ్లగలమా... అని భయమేస్తుంది
-కంభంపాటి శిరీష, అమరావతి రైతు జేఏసీ నాయకురాలు, ఎస్సైన్డ్‌ రైతు
అమరావతి ప్రజలకు రాజ్యాంగం, చట్టం వర్తించవా? దిశ, నిర్భయ చట్టాలు ఇక్కడి మహిళలకు వర్తించవా? 500 రోజుల ఉద్యమంలో మేం పడని కష్టాల్లేవు. అంబేడ్కర్‌ వారసులుగా పోరాటంలో ముందుకు వెళుతున్నాం. ఆయన రాసిన రాజ్యాంగానికి ఇక్కడ విలువే లేదు. దుర్గగుడికి వెళ్లాలన్నా, గ్రామ దేవతలకు పొంగళ్లు సమర్పించుకోవాలన్నా, చర్చిలకు వెళ్లాలన్నా పోలీసుల అనుమతి కావాలి. లాఠీఛార్జి చేస్తారు. ఒక్కోసారి ఇంటికి ప్రాణాలతో తిరిగి వెళతామా లేదా అన్న భయం కలుగుతుంది. ఓసారి పోలీసులు మా మెడల్లోని పుస్తెల తాళ్లు తెంచేశారు. మహిళా దినోత్సవం రోజున లాఠీఛార్జి చేశారు. సిట్‌ విచారణ పేరుతో ఎస్సైన్డ్‌ రైతులకు కౌలు చెల్లించడం లేదు.

మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా?
-శివారెడ్డి, అమరావతి పరిరక్షణ సమితి కన్వీనర్‌
500 రోజులుగా ప్రజలు, రైతులతో కలసి మేం ప్రజాస్వామ్యయుతంగా చేస్తున్న పోరాటాన్ని అణచివేసేందుకు ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు. దీక్షకు కూర్చున్నా, బహిరంగసభ పెట్టుకున్నా అనుమతి లేదని, కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించారని అరెస్టు చేస్తోంది. మాకు పోటీగా, మూడు రాజధానులకు అనుకూలంగా ప్రభుత్వమే దీక్ష చేయిస్తోంది. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లయిన సందర్భంగా ఒకపక్క ప్రభుత్వమే ఉత్సవాలు చేస్తోంది. మరోపక్క గాంధేయమార్గంలో, కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ పోరాడుతున్న మాపై ఉక్కుపాదం మోపుతోంది. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? నిరంకుశ పాలనలోనా? ఈ రెండేళ్లలో అమరావతి ముంపు ప్రాంతమని, భారీ నిర్మాణాలకు ఇక్కడి నేల పనికిరాదని, ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందనీ... ప్రభుత్వం ఎన్నో అపవాదులు వేసింది. అమరావతి నిర్మాణానికి రూ.లక్ష కోట్లు కావాలని, అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తామని చెప్పిన ప్రభుత్వమే... ఇప్పుడున్న ప్రాజెక్టులు పూర్తి చేయడానికి రూ.3 వేల కోట్లు చాలని జీవో ఇచ్చింది. అమరావతి సెల్ఫ్‌ఫైనాన్స్‌డ్‌ ప్రాజెక్టని ప్రభుత్వం చెప్పకనే చెప్పింది. ఉద్యమం మొదలయ్యాక ఇప్పటివరకు 160-170 మంది రైతులు, రైతు కూలీలు మానసిక వేదనతో మరణించారు.

దళితులే ఎక్కువ నష్టపోతున్నారు
-చిలకా బసవయ్య, ఎస్సీ నాయకుడు
మూడు రాజధానుల పేరిట అమరావతి నిర్మాణం నిలిపివేయడంతో దళితులే ఎక్కువ నష్టపోతున్నారు. వారి కోసం కట్టిన టిడ్కో ఇళ్లను ఇప్పటికీ కేటాయించలేదు. ఉపాధి లేదు. రాజధాని పనులు సాగుతున్నప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు 40 వేల మంది ఇక్కడ ఉండేవారు. కార్మికులు ఒక ఆదివారం వచ్చి కూరగాయలు, సరకులు కొనుక్కుంటే మాకు వారానికి సరిపడా ఆదాయం వచ్చేది. మాలో కొందరు సెక్యూరిటీ గార్డులుగా పనిచేసేవారు. ఇప్పుడు మా మహిళలు... కుటుంబం గడవడానికి మిరపకాయల తొడిమెలు తీస్తున్నారు. కొందరు పొగాకు పొలాల్లో పనిచేసేందుకు వలస పోయారు.

దళితుల అణచివేతే ప్రభుత్వ లక్ష్యం
-గెడ్డం మార్టిన్‌ లూథర్‌ బాబు, దళిత జేఏసీ కన్వీనర్‌, ఎసైన్డ్‌ రైతు
మా ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించక ముందు... ఎస్సీలు, బీసీలు, మైనారిటీ వర్గాల పేదలమంతా రైతుల పొలాల్లో కూలీలుగా జీవించేవాళ్లం. రాజధానిగా ప్రకటించడాన్ని మొదట్లో మేమూ వ్యతిరేకించాం. కాలేజీలు, ఆస్పత్రులు, పరిశ్రమలు వస్తాయని, పిల్లల భవిష్యత్తు బాగుంటుందని ప్రభుత్వం నచ్చజెప్పింది. భూములిచ్చిన రైతులు, ఎస్సైన్డ్‌ రైతులకు ఒకేచోట స్థలాలు కేటాయించింది. కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా చదువు చెప్పిస్తామని హామీ ఇచ్చింది. నైపుణ్యాభివృద్ధి కేంద్రాలనూ పెట్టింది. రాజధాని నిర్మాణం మొదలయ్యాక మా వాళ్లకు ఉద్యోగాలు వచ్చాయి. ఈ ప్రభుత్వం అధికార వికేంద్రీకరణ పేరుతో మా బతుకుల్ని రోడ్డున పడేసింది. మేం దళిత జేఏసీని ఏర్పాటు చేశాం. ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలే 80% ఉన్నారు. రాజధాని ఇక్కడే ఉంటే... అధికారం బహుజన కులాలదవుతుందన్న కారణంతోనే ప్రభుత్వం దీన్ని నీరుకారుస్తోంది. నా ఒక్కడిపైనే 24 కేసులు పెట్టింది. ఎక్కువ చేస్తున్నావు, కాల్చి పారేస్తానని జిల్లా ఎస్పీ నన్ను బెదిరించారు.

ఇవీ చదవండి:నేడే మినీ పురపోరు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు..!

ABOUT THE AUTHOR

...view details