రాష్ట్రంలో మిగిలిన వలస కూలీలను సొంత ప్రాంతాలకు చేరవేసేందుకు ప్రభుత్వం, రైల్వే శాఖ అన్ని ఏర్పాట్లు చేశాయి. హైకోర్టు ఆదేశాలతో.. కూలీలను ఇవాళ శ్రామిక్ రైళ్లలో తరలించనున్నారు. ఇటుక బట్టిల్లో పని చేస్తున్న కార్మికులు స్వస్థలాలకు వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నారంటూ... దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై హైకోర్టు బుధవారం మరోసారి విచారణ చేపట్టింది.
మరో 16 వేల మంది..
మిగిలిన కూలీలను తరలించేందుకు ఎందుకు ఏర్పాట్లు చేయలేదని ధర్మాసనం ప్రశ్నించగా... ఇప్పటి వరకు సుమారు 49 వేల మంది స్వస్థలాలకు చేరుకున్నారని కార్మిక శాఖ తెలిపింది. మరో 16 వేల మంది వెళ్లటానికి సిద్ధంగా ఉన్నారని నివేదించింది. వారిని సైతం తరలించాలని ధర్మాసనం పేర్కొనగా.. ప్రభుత్వం తగు ఏర్పాట్లు చేసింది. ఒడిశా, శ్రీకాకుళానికి చెందిన వారిని ఐదు శ్రామిక్ రైళ్లలో తరలిస్తోంది. మరో నాలుగు రైళ్లు ఏర్పాటు చేసి మిగిలిన వారిని చేరవేసేందుకు సన్నాహాలు చేస్తోంది.