తెలంగాణ

telangana

ETV Bharat / city

రోగి పట్ల నిర్లక్ష్యం... వైద్యుడికి రూ. 5 లక్షల జరిమానా - ncdrc imposed 5 lakhs to doctor

రోగి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించి ఆమె మృతికి కారణమైన వైద్యుడి తీరును జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్​ తప్పుబట్టింది. మృతురాలి కుటుంబ సభ్యులకి రూ. 5 లక్షలు చెల్లించమని ఆదేశించింది.

రోగి పట్ల నిర్లక్ష్యం... వైద్యుడికి రూ. 5 లక్షల జరిమానా
రోగి పట్ల నిర్లక్ష్యం... వైద్యుడికి రూ. 5 లక్షల జరిమానా

By

Published : Mar 5, 2020, 10:51 AM IST

తీవ్ర స్థాయి పచ్చకామెర్లతో రోగి బాధ పడుతున్న విషయాన్ని పట్టించుకోకుండా ఆసుపత్రి నుంచి ఇంటికి పంపించి, ఆమె మరణానికి కారణమయ్యారంటూ ఓ వైద్యుడిని జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్​ (ఎన్​సీడీఆర్​సీ) తప్పుపట్టింది. నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గానూ రోగి పిల్లలకు ఆ వైద్యుడు రూ. 5 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్​కు చెందిన సి. పద్మావతి అనే మహిళ 2010 ఆగస్టులో తన కుడికాలి దిగువ భాగంలో ఏర్పడిన పుండు చికిత్స కోసం కర్నూలు జిల్లా నంద్యాలలోని డాక్టర్​ టి.వై. విశ్వరూపాచారిని సంప్రదించింది. ఆయనకు చెందిన వీరబ్రహ్మేంద్ర నర్సింగ్​హోంలో చేరింది. ఆమెకు అయిన ఇన్​ఫెక్షన్​ మెదడుకూ సోకిన విషయం తర్వాత బయటపడింది. మెరుగైన చికిత్స, కోసం మరో ఆసుపత్రికి తరలించినా కొద్దిరోజుల్లోనే ఆమె ప్రాణాలు కోల్పోయింది. డాక్టర్​ విశ్వరూపాచారి ఆమె సమస్యను సకాలంలో గుర్తించి చికిత్స చేయలేకపోయారంటూ మృతురాలి భర్త మొదటగా జిల్లా వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు. దానిని అక్కడ కొట్టివేశాక రాష్ట్ర ఫోరాన్ని ఆశ్రయించారు. రూ 1.5 లక్షల పరిహారం చెల్లించాలని రాష్ట్ర ఫోరం ఆదేశించింది. దానిని డాక్టర్​ విశ్వరూపాచారి ఎన్​సీడీఆర్​సీలో సవాల్​ చేశారు. ఆయన పిటిషన్​ను జాతీయ ఫోరం కొట్టివేసి, పరిహారాన్ని రూ. 5 లక్షలకు పెంచింది. మృతురాలి భర్త ఫిర్యాదు చేసిన తేదీ నుంచి రూ. 5 లక్షల మొత్తంపై 9 శాతం వడ్డీని కూడా కలిపి ఆరు వారాల్లో చెల్లించాలంది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details