వలస కార్మికులను తరలించడంతో తెలుగు రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ... దక్షిణ మధ్య రైల్వే ముందుకెళ్తోంది. మే 1 మేడే సందర్భంగా లింగపల్లి నుంచి మొదటి సారిగా శ్రామిక్ రైలును ద.మ.రైల్వే నడిపించింది. అప్పటి నుంచి మే 24 వరకు ద.మ.రైల్వే నిరాటంకంగా శ్రామిక్ రైళ్లను నడిపిస్తోంది. గడిచిన 16రోజుల్లో లక్షమంది వలస కూలీలను తరలిస్తే... ఆ తర్వాత కేవలం వారం రోజుల్లో లక్షకు పైగా వలస కూలీలను తరలించింది.
12 గంటల్లో 41వేల వలసకార్మికులు
మే 23న ద.మ.రైల్వే జోన్ పరిధిలో కేవలం 12 గంటల్లో 43 రైళ్లను నడిపి 41వేల ప్రయాణికులను వారి స్వస్థలాలకు సురక్షితంగా చేరవేసింది. వీటిలో రెండు రైళ్లు ఆంధ్రప్రదేశ్ నుంచి ఉత్తర్ ప్రదేశ్‌కు, ఒక రైలును మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నుంచి నడిపించారు. మిగిలిన 40 రైళ్లను తెలంగాణ నుంచి నడిపించారు. హైదరాబాద్ రైల్వే స్టేషన్ నుంచి 8 రైళ్లను ఒడిశాకు, ఘట్ కేసర్ రైల్వే స్టేషన్ నుంచి 6 రైళ్లను ఝార్ఖండ్‌కు, సికింద్రాబాద్ స్టేషన్ నుంచి 10 రైళ్లను బిహార్‌కు, లింగంపల్లి స్టేషన్ నుంచి 8 రైళ్లను ఉత్తర్‌ప్రదేశ్‌కు, కాజీపేట్ స్టేషన్ నుంచి 3 రైళ్లను ఒడిశాకు, కాచిగూడ స్టేషన్ నుంచి 4 రైళ్లు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలకు, మహబూబ్ నగర్ నుంచి ఒక్క రైలు ఒడిశాకు నడిపించారు.