Edible oil Investment in Telangana: తెలంగాణలో ఆయిల్ రిఫైనరీ ఏర్పాటు కోసం జెమిని ఎడిబుల్స్ సంస్థ రూ.400 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. సింగపూర్‌కు చెందిన గోల్డెన్ అగ్రి ఇంటర్నేషనల్, ఫ్రీడమ్ ఆయిల్ సంస్థల సంయుక్త భాగస్వామ్యంతో ఈ పెట్టుబడి పెట్టనున్నారు. రూ.400 కోట్లతో హైదరాబాద్ సమీపంలో ఆయిల్ రిఫైనరీ ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో సమావేశమైన జెమిని ఎడిబుల్స్ ఎండీ ప్రదీప్ చౌదరి.. ఈ మేరకు ప్రకటన చేశారు. జెమిని ఎడిబుల్స్ సంస్థ నిర్ణయాన్ని స్వాగతించిన మంత్రి కేటీఆర్.. ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సహకారం అందిస్తామని చెప్పారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణలో హరిత, నీలి, గులాబి, శ్వేత విప్లవాలు కొనసాగుతున్నాయని.. రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగుతో పసుపు విప్లవం దిశగా కూడా వెళ్తున్నట్లు కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. జెమిని ఎడిబుల్స్ సంస్థ పెట్టుబడి రాష్ట్రంలో వంటనూనెల ఉత్పత్తిలో కీలకపాత్ర పోషిస్తుందని.. ముఖ్యంగా స్థానిక రైతులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. భవిష్యత్‌లో తెలంగాణలో మరిన్ని యూనిట్లు ఏర్పాటు చేస్తామని జెమిని ఎడిబుల్స్ సంస్థ ఎండీ ప్రదీప్ తెలిపారు. వెయ్యి మందికి పైగా స్థానికులకు ఉపాధి లభించడంతో పాటు రాష్ట్ర రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.