రాష్ట్రవ్యాప్తంగా గణేశ్ నిమజ్జనం కోలాహలంగా సాగుతోంది. హైదరాబాద్‌లోని గణనాయకులు గంగమ్మ ఒడికి చేరుకునేందుకు ట్యాంక్‌బండ్‌కు క్యూకట్టాయి. హుస్సేన్‌సాగర్‌కు వచ్చే క్రమంలో వినాయకుల శోభాయాత్ర కన్నులపండువగా సాగింది. నగరంలోని వినాయకులే కాకుండా పక్కనున్న సంగారెడ్డి నుంచి కూడా ఓ వినాయకుడు ట్యాంక్‌బండ్‌లో నిమజ్జనమయ్యేందుకు వినూత్నంగా తరలివచ్చాడు.
స్కేటింగ్ చేస్తూనే శోభాయాత్ర..
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని వావివాల గ్రామానికి చెందిన లక్ష్మణ్.. తన ఇంట్లో వినాయకున్ని ప్రతిష్ఠించుకున్నాడు. నవరాత్రులు ఘనంగా పూజించాడు. నిమజ్జనం ట్యాంక్బండ్లోనే చేయాలన్న పట్టుదలతో హైదరాబాద్‌కు తీసుకొచ్చాడు. అందరిలాగా.. ఆ వినాయకుని శోభాయాత్ర ఆటోలోనో.. కారులోనో.. లారీలోనో.. ట్రాలీలోనో.. బండిపైనో సాగలేదు. వినూత్న రీతిలో ఆ భక్తుడే స్కేటింగ్ చేస్తూ.. ట్యాంక్‌బండ్‌కు తరలివచ్చాడు. దాదాపు 40 కిలోమీటర్ల దూరం స్కేటింగ్ చేసుకుంటూనే.. తన బుజ్జి గణేశున్ని హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేసేందుకు తీసుకొచ్చాడు.