Students Reached Hyderabad: ఆపరేషన్ గంగ పేరుతో ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపు కొనసాగుతోంది. బుకారెస్ట్ నుంచి 249 మంది భారతీయులతో ఐదో విమానం దిల్లీ చేరుకుంది. వీరిలో 16 మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఉన్నారు. వారిలో 11 మంది తెలంగాణ, ఐదుగురు ఏపీకి చెందిన వారు ఉన్నారు. దిల్లీకి చేరుకున్న విద్యార్థులు హైదరాబాద్, తిరుపతికి బయలుదేరారు.
ఇప్పటికే ఇంటికి చేరిన 39 మంది..
ఉక్రెయిన్ నుంచి దిల్లీకి 25 మంది, ముంబయికి 14 మంది రాగా.. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అధికారులు ముంబయిలో వసతి ఏర్పాట్లు చేశారు. దిల్లీలో తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ ఆధ్వర్యంలో అవసరమైన ఏర్పాట్లు చేశారు. వారందర్నీ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం విమానాల్లో ఉచితంగా శంషాబాద్‌కు తీసుకొచ్చింది. శంషాబాద్‌లో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, జీఏడీ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్, ఇతర అధికారులు స్వాగతం పలికారు. తమను క్షేమంగా స్వదేశానికి తీసుకొచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, రాయబార కార్యాలయ అధికారులకు విద్యార్థులు, తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. ఉక్రెయిన్‌లో ఇంకా ఉన్న వారినీ సురక్షితంగా తీసుకొస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) సోమేశ్‌కుమార్ తెలిపారు. అక్కడి నుంచి వచ్చిన విద్యార్థుల వివరాలను ఆయన ఎప్పటికప్పుడు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లకు అందించారు.
తీవ్రంగా ఆందోళన చెందాం
కొంత మంది విద్యార్థులు రాష్ట్రానికి చేరుకున్నా ఇంకా అనేకమంది ఉక్రెయిన్‌లోనే ఉన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి తమను వీలైనంత త్వరగా భారత్‌కు తీసుకెళ్లాలని వారు కోరుతున్నారు.
చెర్నవిట్స్ ప్రాంతంలోని బుకోవినియన్ స్టేట్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ ఐదో సంవత్సరం చదువుతున్నా. ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలో భీకర యుద్ధం సాగుతోంది. మేము ఉండే పశ్చిమ ప్రాంతంలో యుద్ధ వాతావరణం లేదు. అక్కడ కూడా ఆరంభమయ్యేలోపు ఎలా బయటపడాలా అని ఆందోళనపడ్డాం. మేము ఉండే ప్రాంతానికి దగ్గరగా ఉండే రుమేనియాకు త్వరగా చేరుకోగలిగాం. అక్కడి నుంచి ముంబయికి.. ఆ తర్వాత హైదరాబాద్ చేరుకున్నాం. ఇంకా 2 వేల విద్యార్థులు అక్కడే ఉన్నారు. - సుప్రియ, శేరిలింగంపల్లి