తెలంగాణ

telangana

ETV Bharat / city

తెలంగాణలో.. 5 ఏళ్లలో సారం కోల్పోయిన భూమి 39 లక్షల హెక్టార్లు - తెలంగాణ భూముల్లో సారం క్షీణత

Telangana News Today : తెలంగాణలో మొత్తం 39,652 లక్షల హెక్టార్ల భూమి సారం కోల్పోయింది. 2011-13తో పోలిస్తే 2018-19లో అధిక భూమి క్షీణతకు గురైన రాష్ట్రాల జాబితాలో తెలంగాణ 17, ఆంధ్రప్రదేశ్ 6వ స్థానంలో నిలిచాయి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఆధ్వర్యంలోని స్పేస్‌ అప్లికేషన్స్‌ సెంటర్‌ తాజాగా విడుదల చేసిన ‘డెసెర్టిఫికేషన్‌ అండ్‌ ల్యాండ్‌ డీగ్రెడేషన్‌ అట్లాస్‌’లో ఈ వివరాలు వెల్లడయ్యాయి.

Telangana soil
Telangana soil

By

Published : Feb 23, 2022, 7:11 AM IST

Telangana News Today : దేశవ్యాప్తంగా 2011-13 నుంచి 2018-19 మధ్యకాలంలో కొత్తగా 14.5 లక్షల హెక్టార్ల భూమి సారం కోల్పోయింది. తెలంగాణ రాష్ట్రంలో ఇదే సమయంలో 39,652 హెక్టార్లు, ఆంధ్రప్రదేశ్‌లో 79,283 హెక్టార్ల భూమి నిస్సారంగా మారింది. అత్యధికంగా మహారాష్ట్రలో 4,80,094 హెక్టార్ల భూమి ఎడారీకరణ/క్షీణతకు గురై ఈ జాబితాలో తొలి స్థానంలో ఉంది. 2011-13తో పోలిస్తే 2018-19లో అధిక భూమి క్షీణతకు గురైన రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ 6, తెలంగాణ 17వ స్థానంలో నిలిచాయి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఆధ్వర్యంలోని స్పేస్‌ అప్లికేషన్స్‌ సెంటర్‌ తాజాగా విడుదల చేసిన ‘డెసెర్టిఫికేషన్‌ అండ్‌ ల్యాండ్‌ డీగ్రెడేషన్‌ అట్లాస్‌’లో ఈ వివరాలు వెల్లడయ్యాయి. రాష్ట్రంలో ఎడారీకరణ/భూక్షీణతకు నీటికోత, అటవీసంపద తగ్గిపోవడం ప్రధాన కారణాలుగా ఉన్నాయి.

2018-19 నాటికి..

Telangana Lands : దేశవ్యాప్తంగా 2018-19 నాటికి మొత్తం 9.78 కోట్ల హెక్టార్ల (29.77%) భూమి క్షీణతకు గురైంది. తెలంగాణ రాష్ట్ర మొత్తం భూభాగం 1,14,84,000 హెక్టార్లు కాగా.. అందులో 36,38,508 హెక్టార్లు (31.68%) ఎడారీకరణకు గురైంది. ఆంధ్రప్రదేశ్‌లో 14.84% భూమి క్షీణతకు గురైంది. ఇప్పటివరకు అత్యధిక క్షీణతకు గురైన దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కేరళ వరుస స్థానాలను ఆక్రమించాయి.

2003-05 నుంచి 2011-13 మధ్య కొంత మెరుగు

Telangana Soil : తెలంగాణ రాష్ట్రంలో 2003-05 వరకు భూక్షీణతకు గురైన ప్రాంతం.. 31.86% కాగా.. 2011-13 నాటికి ఆ మొత్తం 31.34%కి తగ్గింది. అంటే ఆ పదేళ్లలో భూక్షీణతలో 0.52% తగ్గుదల (59,626 హెక్టార్లు) నమోదైంది. 2011-13 నుంచి 2018-19 మధ్యకాలంలో మాత్రం భూక్షీణత 0.34% (39,652 హెక్టార్లు) మేర పెరిగింది. ఇదే కాలంలో నీటికోతకు గురయ్యే వ్యవసాయ భూముల విస్తీర్ణం తగ్గింది. అయితే మానవ చర్యలు, లవణీకరణ కారణంగా క్షీణతకు గురైన భూమి ఎక్కువైంది.

రాష్ట్రంలో భూసార క్షీణత ఇలా..

వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం భూసార క్షీణత ఇలా..

Telangana Soil News : రాష్ట్రాలవారీ భూభాగాల పరంగా చూస్తే ఇప్పటివరకూ ఝార్ఖండ్‌లో 68.77%, రాజస్థాన్‌లో 62.06%, దిల్లీలో 61.73%, గోవాలో 52.64%, గుజరాత్‌లో 52.22%, నాగాలాండ్‌లో 50%, మహారాష్ట్రలో 46.49%, హిమాచల్‌ప్రదేశ్‌లో 43.11%, త్రిపురలో 42.66%, లద్దాఖ్‌లో 42.31%, కర్ణాటకలో 36.29%, ఒడిశాలో 34.42%, తెలంగాణలో 31.68%, మణిపుర్‌లో 27.44%, మేఘాలయలో 24.86%, జమ్మూకశ్మీర్‌లో 20.86%, పశ్చిమబెంగాల్‌లో 20.10%, ఛత్తీస్‌గడ్‌లో 17.06%, ఆంధ్రప్రదేశ్‌లో 14.84% భూసారం క్షీణతకు గురైంది.

ABOUT THE AUTHOR

...view details