వ్యవసాయం తప్ప మరో మాటే తెలియని వారంతా ఏడాదిగా ఉద్యమమే ఊపిరిగా బతుకుతున్నారు. మహిళలు ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్నారు. ఏపీలో రాజధాని గ్రామాల రైతులు, రైతు కూలీలు కలసి రైతు ఐకాస ఏర్పాటు చేసుకుని ఉద్యమిస్తుంటే, రాజధాని గ్రామాలకు వెలుపల వివిధ వర్గాలవారు అమరావతి పరిరక్షణ సమితి పేరుతో పోరాటం కొనసాగిస్తున్నారు. ధర్నాలు, ర్యాలీలు, మౌన ప్రదర్శనలు, నిరాహార దీక్షలు, ప్రత్యేక ప్రార్థనలు, యజ్ఞాలు, దేవుళ్లకు మొక్కులు, దేశ ప్రధాని మొదలు ప్రముఖులకు లేఖలు, రాష్ట్రపతిని, ఉపరాష్ట్రపతిని, కేంద్ర మంత్రుల్ని, వివిధ పార్టీల జాతీయ నాయకుల్ని స్వయంగా కలసి తమకు మద్దతివ్వాలని అభ్యర్థనలు, సామాజిక మాధ్యమాల్లో సందేశాలు.. ఇలా ఈ ఏడాది కాలంలో వారు చేయని ప్రయత్నం లేదు.. పాలకుల మనసు మారాలని చేయని ప్రార్థన లేదు.
ఈ ఏడాది కాలంలో రాజధాని తరలిపోతుందన్న మానసిక వేదనతో రాజధాని గ్రామాలకు చెందిన 118 మంది రైతులు, కౌలు రైతులు, రైతు కూలీలు మరణించారని అమరావతి రైతు ఐకాస ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమరావతి ఉద్యమానికి ఏడాది పూర్తయిన సందర్భంగా ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.
అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని ప్రశాంతంగా ఉద్యమిస్తున్న ప్రజలపై ఉక్కుపాదం.. ఆంక్షల చక్రబంధంలో పల్లెలు.. అడుగడుగునా అడ్డంకులు, అవరోధాలు, నిర్బంధాలు.. పక్క ఊరికి వెళ్లాలన్నా సవాలక్ష ప్రశ్నలు.. ప్రశాంతమైన గ్రామాల్లో ఖాకీ బూట్ల పదఘట్టనలు... అర్ధరాత్రి తనిఖీలు, అడ్డొస్తే లాఠీఛార్జిలు... ఉద్యమకారులకు బెదిరింపులు.. ఎస్సీలపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు...
అయినా..
వారు భయపడలేదు. ఎత్తిన ఉద్యమ జెండా దించలేదు. పాలకులు కన్నెర్రజేసినా, పోలీసులు లాఠీలు ఝుళిపించినా, ఉద్యమాన్ని దెబ్బతీసేందుకు అనేక కుట్రలు పన్నినా, కరోనా ఉరిమినా.. ఉద్యమ స్ఫూర్తి వీడలేదు. ఒకరోజు కాదు. ఒక వారం కాదు. ఒక నెలతో ఆగలేదు. ఏకంగా ఏడాది కాలంగా రాజధాని రైతులు ఉద్యమిస్తూనే ఉన్నారు. అమరావతి కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రభుత్వం తమతో చేసుకున్న ఒప్పందం అమలు కోసం... అవిశ్రాంతంగా పోరాడుతున్నారు. వానొచ్చినా.. ఎండొచ్చినా.. పండగొచ్చినా... పోరాటం ఆపలేదు. ఒక్కరోజూ విరామం లేకుండా ఉద్యమ నినాదం వినిపిస్తూనే ఉన్నారు. మరోపక్క న్యాయపోరాటమూ చేస్తున్నారు.
2019 డిసెంబరు 17న సాయంత్రం అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానుల ప్రస్తావన చేయడం రాజధాని ప్రజలకు శరాఘాతమైంది. అదే రోజు రాత్రి వారంతా వీధుల్లోకి వచ్చి నిరసన తెలియజేశారు. మర్నాటి నుంచే రాజధాని గ్రామాల్లో అమరావతి పరిరక్షణ ఉద్యమం మొదలైంది. ప్రభుత్వం వేల సంఖ్యలో పోలీసుల్ని రాజధాని గ్రామాల్లో మోహరించింది. 144 సెక్షన్‌తో పాటు, పోలీసు చట్టంలోని సెక్షన్ 30ని ప్రయోగించింది. ఉద్యమాన్ని కట్టడి చేయాలని చూసింది. పోలీసులు రాజధాని గ్రామాల్ని పూర్తిగా తమ గుప్పిట్లోకి తీసుకున్నారు.
ఉద్యమంలో చురుగ్గా ఉన్న ప్రతి వ్యక్తిపైనా నిఘా వేశారు. ఆంక్షలు, నిర్బంధాలతో భయభ్రాంతులకు గురిచేశారు. ఒక ఊరి వ్యక్తి పొరుగూరికి వెళ్లాలన్నా గుర్తింపుకార్డు చూపించాల్సిన దుస్థితి. ఆ సమయంలో ఏ గ్రామంలో చూసినా వేల సంఖ్యలో పోలీసులుండేవారు. ప్రజలపై నిఘాకు డ్రోన్లు ఉపయోగించారు. శిక్షణలో ఉన్న మహిళా కానిస్టేబుళ్లను కూడా విధుల్లో నియమించారు. ఏపీ రాజధాని ప్రజలు రోడ్లపై నిరసన చెబుతుంటే అడ్డుకున్నారు. ప్రైవేటు స్థలాల్లో టెంట్లు వేసుకుని నిరసన తెలుపుతున్నా.. అనుమతుల్లేవని బెదిరించేవారు. రహదారులకు అడ్డుగా ముళ్లకంచెలు వేసేవారు. ఇళ్లల్లోకి వెళ్లి అర్ధరాత్రి తనిఖీలు చేశారు. ముఖ్యమంత్రి సచివాలయానికి వెళుతుంటే ఆరేడు కిలోమీటర్ల దూరంలోని తుళ్లూరు వద్దే ట్రాఫిక్ ఆపేసేవారు.
విజయవాడ దుర్గమ్మకు పొంగళ్లు సమర్పించి, వేదన వెళ్లబోసుకునేందుకు మహిళలు వెళుతుంటే పోలీసులు అడ్డుకుని లాఠీఛార్జి చేశారు. ఆ దాడిలో పలువురు మహిళలు గాయపడ్డారు. ఒక మహిళ గొంతు పట్టుకుని పోలీసులు గట్టిగా నొక్కడంతో ఇప్పటికీ ఆమె సరిగ్గా మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. అసెంబ్లీ ముట్టడికి పెద్ద ఎత్తున తరలి వచ్చిన రాజధాని ప్రజలపై పోలీసులు లాఠీఛార్జి చేశారు. నిరసనగా ఆ మర్నాడు మందడంలో దీక్ష చేస్తున్న మహిళలపైనా లాఠీలు ఝుళిపించారు. ఒక గర్భిణిని పోలీసు అధికారి కాలితో తన్నడంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స చేయించుకుని అత్తారింట్లో విశ్రాంతి తీసుకుంటుంటే.. రాజధానిలో జరిగిన మరో సంఘటనలో ఆమెపై అక్రమంగా కేసు పెట్టారు. మందడంలో మహిళలపై దాడి తర్వాత హైకోర్టు మందలించడంతో రాజధాని గ్రామాల్లో పోలీసు నిర్బంధం కొంత తగ్గింది. 144 సెక్షన్ తొలగించారు. అయినా ఇప్పటికీ ఏదో ఒక రూపంలో ఆంక్షలు కొనసాగుతున్నాయి.
ఏడాది పోరు.. 4 దశలు
తొలి దశ: సీఎం ప్రకటనతో ఉవ్వెత్తున మొదలై
2019 డిసెంబరు 17న ముఖ్యమంత్రి అసెంబ్లీలో మూడు రాజధానుల ప్రకటన చేయడంతో ఉద్యమం మొదలైంది. తుళ్లూరు, మందడం, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం గ్రామాల్లో మొదలై.. రాజధాని గ్రామాలన్నింటికీ విస్తరించింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోనూ ఆందోళనలు జరిగాయి. రాజధాని రైతులు ప్రత్యేకంగా జేఏసీ ఏర్పాటు చేసుకున్నారు. వైకాపా తప్ప, అన్ని పార్టీల నేతలు, ఆధ్యాత్మిక, సినీ ప్రముఖులూ, ఇతర రాష్ట్రాల రైతు నాయకులు మద్దతు ప్రకటించారు.
రెండో దశ: అసెంబ్లీలో బిల్లులతో ఉద్ధృతం