తెలంగాణ

telangana

ETV Bharat / city

సత్ఫలితాలిచ్చిన దర్పణ్‌ యాప్‌... 3,178 మంది చిన్నారులకు విముక్తి - సత్ఫలితాలిచ్చిన దర్పణ్‌ యాప్

తప్పిపోయిన, అదృశ్యమైపోయిన పిల్లల్ని రక్షించేందుకు రూపొందించిన దర్పణ్​ యాప్​ సత్ఫలితాలనిస్తోంది. ఆపరేషన్‌ స్మైల్‌-7లో భాగంగా రాష్ట్రంలో 3,178 మంది చిన్నారులకు విముక్తి కల్పించగలిగారు. రాష్ట్రంలో 2014 నుంచి 2020 వరకు 17224 మంది చిన్నారుల అదృశ్యం కేసులు నమోదు కాగా.. 12,807 మందిని రక్షించినట్లు పోలీసులు వెల్లడించారు.

3178 children rescued in the part of operation smile in telangana
3178 children rescued in the part of operation smile in telangana

By

Published : Jan 31, 2021, 8:41 AM IST

ఏపీలోని కర్నూల్‌కు చెందిన కుటుంబం 2005 అక్టోబరు 20న చార్మినార్‌ చూసేందుకు వచ్చింది. వారి రెండున్నరేళ్ల బాలిక అక్కడ తప్పిపోగా... గమనించిన వ్యక్తి ఉప్పల్‌లోని హ్యాపీహోంకు చేర్చారు. ఆపై మియాపూర్‌లోని వివేకానంద సేవా సమితికి తరలించారు. తాజా ఆపరేషన్‌(స్మైల్‌-7)లో భాగంగా ఆ బాలికను గుర్తించి తల్లిదండ్రుల చెంతకు చేర్చారు.

సరిగా చదవటంలేదని తండ్రి మందలించడంతో నల్గొండ శాంతినగర్‌కు చెందిన 14ఏళ్ల బాలుడు 2014 జనవరి 1న ఇంటి నుంచి పారిపోయాడు. హైదరాబాద్‌లోని ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌లో పనిచేస్తూ వచ్చాడు. కొడుకు అదృశ్యమైనట్లు తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో బాలుడి స్నేహితుల ఫోన్‌కాల్స్‌ను విశ్లేషించిన స్మైల్‌ బృందం కుర్రాడి జాడ కనిపెట్టి కుటుంబానికి అప్పగించింది.

తప్పిపోయిన, అదృశ్యమైపోయిన పిల్లల్ని రక్షించేందుకు ఉద్దేశించిన ఆపరేషన్‌ స్మైల్‌-7లో భాగంగా తెలంగాణలో 3,178 మంది చిన్నారులకు విముక్తి కల్పించగలిగారు. పోలీస్‌, మహిళాశిశు సంక్షేమ, కార్మిక తదితర శాఖలకు చెందిన 110 బృందాలు ఈ కార్యాచరణలో నిమగ్నమయ్యాయి. రాష్ట్ర మహిళా భద్రత విభాగం అదనపు డీజీ స్వాతిలక్రా నేతృత్వంలోని పోలీస్‌ బృందాలు చైల్డ్‌ పోర్టల్‌ ట్రాక్‌, ఫేషియల్‌ రికగ్నిషన్‌ యాప్‌ ‘దర్పణ్‌’ తదితర సాంకేతిక సేవల్ని వినియోగించడం సత్ఫలితాలిచ్చింది. విముక్తి పొందిన చిన్నారుల్లో 2679 మంది బాలలు, 499 మంది బాలికలున్నారు. వీరిలో తెలంగాణకు చెందిన 2096 మంది బాలలు, 277 మంది బాలికలుండగా.. ఇతర రాష్ట్రాలకు చెందిన 583 మంది బాలలు, 222 మంది బాలికలున్నట్లు గుర్తించారు. మొత్తం చిన్నారుల్లో 630 మంది బాలకార్మికులున్నట్లు వెల్లడైంది. చిన్నారులతో పనిచేయిస్తున్న 442 మందిని అరెస్ట్‌ చేశారు. విముక్తి పొందిన చిన్నారుల్లో 2188 మందిని తల్లిదండ్రుల చెంతకు చేర్చారు.

ఆరేళ్లలో 12,807 మంది గుర్తింపు: డీజీపీ

రాష్ట్రంలో 2014 నుంచి 2020 వరకు 17224 మంది చిన్నారుల అదృశ్యం కేసులు నమోదు కాగా.. 12,807 మందిని రక్షించామని డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి వెల్లడించారు. ఆపరేషన్‌ స్మైల్‌-7 ముగింపులో భాగంగా వివిధ జిల్లాల అధికారులతో శనివారం ఆయన వెబ్‌ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఆపరేషన్‌ స్మైల్‌-7లో భాగంగా 3,178 మంది చిన్నారుల్ని రక్షించామన్నారు. సంబంధిత శాఖల మధ్య సమన్వయానికి ప్రత్యేక ఐటీ ప్రోగ్రామ్‌ను రూపొందించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆపరేషన్‌ స్మైల్‌-7 వివరాలతో కూడిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆపరేషన్‌లో ప్రతిభ చూపిన సైబరాబాద్‌ ఏహెచ్‌టీయూ ఎస్సై రేణుకను, హైదరాబాద్‌, నారాయణపేట బృందాలను అభినందించారు. కార్యక్రమంలో అదనపు డీజీపీ స్వాతిలక్రా, ఐజీ రాజేశ్‌కుమార్‌, డీఐజీ సుమతి, స్త్రీ, శిశుసంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి దివ్య దేవరాజన్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:మైనర్ బాలిక అదృశ్యం.. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు

ABOUT THE AUTHOR

...view details