తెలంగాణ

telangana

ETV Bharat / city

పదో తరగతితోనే 30 వేల ఉద్యోగం.. అది కూడా కేంద్రీయ సంస్థల్లో..! - 30 thousand rupees salaried jobs with 10th class

పదో తరగతి విద్యార్హతతో కేంద్రీయ సంస్థల్లో కొలువుదీరే అవకాశం వచ్చింది. మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌, హవల్దార్‌ పోస్టుల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) ప్రకటన విడుదలచేసింది. పరీక్షల్లో చూపిన ప్రతిభతో నియామకాలు చేపడతారు. విధుల్లో చేరిన మొదటి నెల నుంచే సుమారు 30 వేల రూపాయిల వేతనం అందుకోవచ్చు. ప్రకటన పూర్తి వివరాలు చూద్దాం!

30 thousand rupees salaried job in  Central organizations only with 10th class
30 thousand rupees salaried job in Central organizations only with 10th class

By

Published : Apr 16, 2022, 9:53 AM IST

మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ నాన్‌ టెక్నికల్‌ పోస్టులకు ఎంపికైనవారు కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు/ కార్యాలయాల్లో, దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ సంస్థల్లో విధులు నిర్వర్తిస్తారు. హవల్దార్‌ పోస్టులకు ఎంపికైనవారు కేంద్ర రెవెన్యూ, ఆర్థిక మంత్రిత్వ శాఖలకు అనుబంధంగా పనిచేస్తారు. కేంద్రంలోని పరోక్ష పన్నుల విభాగాలు, నార్కోటిక్‌ బ్యూరోలో వీరి విధులుంటాయి. మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌, హవల్దార్‌ రెండూ లెవెల్‌-1 ఉద్యోగాలే. వీరికి రూ.18వేల మూలవేతనం అందుతుంది. దీనికి డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర అలవెన్సులు అదనంగా దక్కుతాయి. అందువల్ల వీరు రూ.30 వేల వరకు జీతం అందుకోవచ్చు. అనుభవం, శాఖాపరమైన పరీక్షల ద్వారా భవిష్యత్తులో వీరు మెరుగైన స్థాయికి చేరుకోవచ్చు.

ఎంపిక విధానం..:ఆన్‌లైన్‌ ఆబ్జెక్టివ్‌ పరీక్ష, డిస్క్రిప్టివ్‌ పరీక్ష, సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ ద్వారా ఎంటీఎస్‌ పోస్టులు భర్తీ చేస్తారు. హవల్దార్‌ పోస్టులకు అదనంగా పీఈటీ, పీఎస్‌టీలు ఉంటాయి.

పేపర్‌-1:దీన్ని ఆన్‌లైన్‌లో వంద మార్కుల నిర్వహిస్తారు. ఇందులో జనరల్‌ ఇంగ్లిష్‌, జనరల్‌ ఇంటలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌, న్యూమరికల్‌ ఆప్టిట్యూడ్‌, జనరల్‌ అవేర్‌నెస్‌ విభాగాల్లో ఒక్కో అంశం నుంచి 25 చొప్పున మొత్తం వంద ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది. పరీక్ష వ్యవధి 90 నిమిషాలు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌ తరహాలో ఉంటాయి. తప్పుగా గుర్తించిన జవాబుకు పావు మార్కు చొప్పున తగ్గిస్తారు. ఇందులో అర్హత సాధించడానికి జనరల్‌ అభ్యర్థులు 30, ఓబీసీ/ఈడబ్ల్యుఎస్‌లు 25, ఇతర విభాగాలవారు 20 మార్కులు పొందడం తప్పనిసరి. ఇలా అర్హుల జాబితా నుంచి మెరిట్‌, రిజర్వేషన్‌ అనుసరించి కొంత మందిని పేపర్‌-2 రాయడానికి ఎంపిక చేస్తారు.

పేపర్‌-2:ఈ పరీక్షను డిస్క్రిప్టివ్‌ విధానంలో నిర్వహిస్తారు. అభ్యర్థుల్లో భాషా పరిజ్ఞానాన్ని తెలుసుకోవడానికి దీన్ని నిర్వహిస్తారు. సమాధానాలు పేపర్‌పై పెన్నుతో రాయాలి. జవాబులు తెలుగులోనూ రాసుకోవచ్చు. యాభై మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. పరీక్ష వ్యవధి 45 నిమిషాలు. ఇందులో భాగంగా ఒక లేఖ, ఒక వ్యాసం రాయాల్సి ఉంటుంది. ఒక్కో దానికీ 25 చొప్పున మార్కులు కేటాయించారు. ఇది అర్హత పరీక్ష మాత్రమే. జనరల్‌ అభ్యర్థులు 20, ఇతర విభాగాలవారు 17.5 మార్కులు పొందితే సరిపోతుంది. ఇందులో సాధించిన మార్కులు తుది ఎంపికలో పరిగణనలోకి తీసుకోరు. అయితే పేపర్‌-1లో ఇద్దరు అభ్యర్థులు సమాన మార్కులు పొందితే పేపర్‌-2లో ఎక్కువ మార్కులు వచ్చినవారికి ప్రాధాన్యం ఉంటుంది.

పీఈటీ:హవల్దార్‌ పోస్టులకు ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్టు ఉంటుంది. ఇందులో భాగంగా పురుషులు 1600 మీటర్ల దూరాన్ని 15 నిమిషాల్లో నడవాలి. మహిళలు ఒక కిలోమీటర్‌ని 20 నిమిషాల్లో పూర్తిచేయాలి. అలాగే పురుషులు 8 కి.మీ. దూరాన్ని సైకిల్‌పై అర గంటలో చేరుకోవాలి. మహిళలైతే 3 కి.మీ. దూరాన్ని 25 నిమిషాల్లో చేరాలి.

పీఎస్‌టీ:పురుషులు 157.5 సెం.మీ. ఎత్తు ఉండాలి. ఛాతీ విస్తీర్ణం 76 సెం.మీ. తప్పనిసరి. అలాగే ఊపిరి పీల్చినప్పుడు ఇది కనీసం 5 సెం.మీ. పెరగాలి. మహిళలకు 152 సెం.మీ. ఎత్తు, 48 కి.గ్రా. బరువు అవసరం.

ముఖ్య సమాచారం

మొత్తం ఖాళీలు: హవల్దార్‌ (సీబీఐసీ, సీబీఎన్‌ విభాగాలు) మొత్తం 3603 ఖాళీలు. ఎంటీఎస్‌ పోస్టుల ఖాళీల వివరాలు తర్వాత ప్రకటిస్తారు.
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత
వయసు:జనవరి 1, 2022 నాటికి ఎంటీఎస్‌ పోస్టులకు 18-25 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే జనవరి 2, 1997 కంటే ముందు జనవరి 1, 2004 తర్వాత జన్మించినవారు అనర్హులు. హవల్దార్‌, ఎంటీఎస్‌లో కొన్ని పోస్టులకు 18 నుంచి 27 ఏళ్ల వరకు అవకాశం ఉంది. వీటికి జనవరి 2, 1995 కంటే ముందు, జనవరి 1, 2004 తర్వాత జన్మించినవారు అనర్హులు. అన్ని పోస్టులకూ ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపులు వర్తిస్తాయి.

ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ:ఏప్రిల్‌ 30 రాత్రి 11 గంటల వరకు.

దరఖాస్తు ఫీజు:రూ.100. మహిళలూ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులూ చెల్లించనవసరం లేదు.

పరీక్ష తేదీ:జులైలో పేపర్‌ 1 నిర్వహిస్తారు. పేపర్‌ 2 వివరాలు తర్వాత ప్రకటిస్తారు.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు:ఏపీలో..చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం. తెలంగాణలో.. హైదరాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌. వెబ్‌సైట్‌: https://ssc.nic.in/

ప్రశ్నలడిగే అంశాలు..

జనరల్‌ ఇంగ్లిష్‌కు హైస్కూల్‌ స్థాయి ఆంగ్ల పాఠ్యపుస్తకాల్లోని వ్యాకరణాంశాలు బాగా చదువుకుంటే ఎక్కువ మార్కులు సాధించడం
కష్టమేమీ కాదు. ప్రశ్నలన్నీ పదో తరగతి పూర్తిచేసుకున్న విద్యార్థి ఎదుర్కునేలా ఉంటాయి. తేలిక, సాధారణ స్థాయిలోనే వీటిని అడుగుతారు. అభ్యర్థి అవగాహనను తెలుసుకునేలా వీటిని రూపొందిస్తారు. సగటు విద్యార్థి ఎక్కువ ప్రశ్నలకు సులువుగానే సమాధానాలు గుర్తించవచ్చు.

జనరల్‌ ఇంటలిజన్స్‌ అండ్‌రీజనింగ్‌:నాన్‌ వెర్బల్‌ ప్రశ్నలు ఉంటాయి. జడ్జిమెంట్‌, డెసిషన్‌ మేకింగ్‌, ఎనాలిసిస్‌, నంబర్‌ ఎనాలజీ, పోలికలు, తేడాలు, పరిశీలనలు, సంబంధాలు, నంబర్‌ క్లాసిఫికేషన్‌, ఫిగర్‌ ఎనాలజీ, నంబర్‌ సిరీస్‌, కోడింగ్‌ - డీకోడింగ్‌, వర్డ్‌ బిల్డింగ్‌...మొదలైన విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. గణితంలోని ప్రాథమికాంశాలపై పట్టు సాధించడం ద్వారా వీటికి సమాధానాలు గుర్తించవచ్చు. తర్కంతో ముడిపడే తేలిక ప్రశ్నలే ఉంటాయి.

జనరల్‌ అవేర్‌నెస్‌:ఈ విభాగంలోని ప్రశ్నలకు సమాధానాలు గుర్తించడానికి ప్రత్యేక ప్రావీణ్యం అవసరం లేదు. సాధారణ పరిజ్ఞానంతోనే జవాబులు రాసేయవచ్చు. ఎక్కువ ప్రశ్నలు దైనందిన జీవితంతో ముడిపడే ఉంటాయి. పర్యావరణాంశాలకు ప్రాధాన్యం ఉంటుంది. రోజువారీ సంఘటనలే (వర్తమాన వ్యవహారాలు) ప్రశ్నలుగా వస్తాయి. వీటితోపాటు భారత్‌- పొరుగు దేశాలు, చరిత్ర, సంస్కృతి, భూగోళం, ఆర్థిక వ్యవహారాలు, పాలిటీ, సైన్స్‌ అంశాల నుంచీ ప్రశ్నలు ఉంటాయి. హైస్కూల్‌ సోషల్‌, సైన్స్‌ పాఠ్యపుస్తకాలు బాగా చదువుకుంటే సరిపోతుంది. వర్తమాన వ్యవహాల ప్రశ్నలు ఎదుర్కోవడానికి జులై 2021 నుంచి ముఖ్యాంశాలను మననం చేసుకోవాలి.
న్యూమరికల్‌ ఆప్టిట్యూడ్‌:అంకెలతో ముడిపడే ప్రశ్నలే ఎక్కువగా అడుగుతారు. అంకెల మధ్య సంబంధం, శాతాలు, సగటు, భిన్నాలు, నిష్పత్తి, సరాసరి, లాభనష్టాలు, కాలం-పని, కాలం-దూరం, వడ్డీ, డిస్కౌంట్‌, కొలతలు, క.సా.గు., గ.సా.భా., వైశాల్యాలు, ఘనపరిమాణాలు మొదలైన అంశాల్లో ప్రశ్నలు వస్తాయి. వీటిలో దాదాపు అన్ని అంశాలూ హైస్కూల్‌ మ్యాథ్స్‌ పుస్తకాల్లోనివే. వాటిని బాగా చదువుకుని వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేస్తే సరిపోతుంది.

జనరల్‌ ఇంగ్లిష్‌:అభ్యర్థి ప్రాథమిక ఆంగ్ల పరిజ్ఞానాన్ని పరిశీలించేలా ప్రశ్నలు వస్తాయి. ఖాళీలు పూరించడం, వాక్యంలో తప్పును గుర్తించడం, సమానార్థాలు, వ్యతిరేక పదాలు, తప్పుగా ఉన్న పదాన్ని గుర్తించడం, జాతీయాలు, సామెతలు, ప్రత్యక్ష, పరోక్ష వాక్యాలుగా మార్చడం, వాక్యంలో పదాలను క్రమ పద్ధతిలో అమర్చడం, కాంప్రహెన్షన్‌..తదితర విభాగాల్లో ప్రశ్నలు వస్తాయి. హైస్కూల్‌ స్థాయి ఆంగ్ల పాఠ్యపుస్తకాల్లోని వ్యాకరణాంశాలు బాగా చదువుకుంటే ఎక్కువ మార్కులు సాధించడం కష్టమేమీ కాదు.

సన్నద్ధత ఎలా?

రాత పరీక్షను జులైలో నిర్వహిస్తారు. అందువల్ల ఇప్పటి నుంచి సిద్ధపడినా సుమారు వంద కంటే ఎక్కువ రోజుల వ్యవధే దొరుకుతుంది. రెండు నెలల్లో సిలబస్‌ మొత్తం పూర్తి చేసుకోవచ్చు. ఈ వ్యవధిలో నోటిఫికేషన్‌లో పేర్కొన్న అంశాలను చదువుకోవాలి. ఇందుకోసం ఎవరికివారు ఆచరణీయమైన ప్రత్యేక కాలపట్టిక తయారుచేసుకుని దానికి అనుగుణంగా సన్నద్ధత మొదలుపెట్టాలి.

  • పేపర్‌-1లో నాలుగు విభాగాలకూ సమాన ప్రాధాన్యం ఉంది కాబట్టి అవగాహన లేని/ వెనుకబడినవాటికి అదనపు సమయం వెచ్చించుకోవాలి.
  • ఎక్కువ పుస్తకాలు చదివితేనే సన్నద్ధత పూర్తయినట్లు భావించరాదు. మార్కెట్‌లో దొరికే ప్రతీ పుస్తకాన్నీ కొనాల్సిన అవసరం లేదు. ఉన్నవాటిలో దేన్నైనా ఎంచుకుని దాన్ని పూర్తిగా చదవాలి. అందులోని అన్ని ప్రశ్నలనూ సాధన చేయాలి.
  • అన్ని అంశాలూ, విభాగాలూ చదవడం పూర్తయిన తర్వాత పాత ప్రశ్నపత్రాలు నిశితంగా పరిశీలించాలి. వాటిని బాగా సాధన చేయాలి. ప్రశ్నల స్థాయి, అంశాలవారీ పరీక్షలో ప్రాధాన్యం గ్రహించి తుది సన్నద్ధతను అందుకు తగ్గట్టుగా మలచుకోవాలి.
  • చివరి నెల రోజులూ వీలైనన్ని మాక్‌ పరీక్షలు రాయాలి. నిర్ణీత సమయంలో వాటిని పూర్తి చేయాలి. ఒక్కో మాక్‌ పరీక్ష పూర్తయిన వెంటనే ఆయా విభాగాలవారీ ఏ అంశాల్లో తప్పు చేస్తున్నారో గమనించి వాటిని ప్రత్యేక శ్రద్ధతో చదివి, అందులో వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేయాలి. ఇదే పద్ధతిని పరీక్ష తేదీ వరకు కొనసాగించాలి.
  • కొన్ని ప్రశ్నలకు సమాధానం గుర్తించడానికి ఎక్కువ వ్యవధి అవసరమవుతుంది. అలాంటివాటిని చివరలో సమయం ఉంటేనే ప్రయత్నించడం మంచిది.
  • కచ్చితంగా జవాబు తెలిసినవాటినే గుర్తించాలి. ఇచ్చిన 4 ఆప్షన్లలో ఏవైనా రెండు సమాధానం కావచ్చు అనే సందేహం ఉంటే ఆలోచించి వాటిలో ఒకదాన్ని ఎంచుకోవచ్చు. అంతేతప్ప అసలేమాత్రం జవాబు తెలియని ప్రశ్నను వదిలేయడమే మంచిది. ఇలాంటి సందర్భాల్లో లాటరీ వేసి గుర్తిస్తే లాభం కంటే నష్టమే ఎక్కువ.
  • వంద ప్రశ్నలకు 90 నిమిషాల వ్యవధి అంటే ప్రతి ప్రశ్నకు 54 సెకన్ల సమయం మాత్రమే దక్కుతుంది. న్యూమరికల్‌ ఆప్టిట్యూడ్‌, జనరల్‌ ఇంటలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌ల్లో ప్రశ్నలకు ఈ సమయం సరిపోకపోవచ్చు. అందువల్ల ఇంగ్లిష్‌, జనరల్‌ అవేర్‌నెస్‌ విభాగాలను వీలైనంత తక్కువ వ్యవధిలో పూర్తిచేసుకోవాలి.
  • పేపర్‌-1 పూర్తయిన తర్వాత పేపర్‌-2, ఫిజికల్‌ టెస్టుపై దృష్టి సారించవచ్చు.

ఈ పరీక్ష సులువుగానే ఉంటుంది. నియామకాలు రాష్ట్రాలవారీగా ఉంటాయి. 2020 ఎంటీఎస్‌ కటాఫ్‌ పరిశీలిస్తే ఏపీ, తెలంగాణలో ఆయా పోస్టులు, విభాగాల ప్రకారం పేపర్‌-1లో 75 నుంచి 80 మార్కులు సాధించిన జనరల్‌ అభ్యర్థులు పేపర్‌-2కు అర్హత పొందారు. అందువల్ల మాక్‌ పరీక్షల్లో కనీసం 80 మార్కులు పొందేలా చూసుకోవాలి.

ఇవీ చూడండి:

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details