గ్రేటర్ ఎన్నికల్లో మరోసారి మజ్లిస్ పార్టీ సత్తా చాటింది. ఓట్ల లెక్కింపు ప్రారంభమై తొలిరౌండ్ ఫలితాలు వెలువడగానే 36 డివిజన్లలో ఆధిక్యం సాధించింది. ఇందులో 20 డివిజన్లలో ప్రత్యర్థులకు అందనంత మెజార్టీతో దూసుకుపోయింది. భాజపా, తెరాసలు ఎన్ని విమర్శలు చేసినా, ఓడించేందుకు ఎంతగా శ్రమించినా.. ఎంపీ అసదుద్దీన్, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ముందుండి నడిపించడంతో పాతబస్తీలో మజ్లిస్‌కి తిరుగులేదని మరోసారి రుజువైంది.
ఎంఐఎం ఓ మతానికి సంబంధించిన పార్టీ కాదని మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్లకు వివరిస్తూనే వచ్చారు. అందుకు తగినట్లుగానే గ్రేటర్ పరిధిలో కొన్ని ప్రాంతాల్లో హిందువులను తమ పార్టీ తరఫున బరిలో నిలబెట్టడమే కాకుండా వారిని గెలిపించుకుని తన మాటకి మరింత బలం చేకూరేలా పావులు కదపగలిగారు. నువ్వా-నేనా అన్నట్లు సాగిన బరిలో ఎంఐఎం నుంచి మరోమారు ముగ్గురు హిందువులు విజయం సాధించారు.
కె. తారాబాయి
ఫలక్‌నుమా నుంచి తారాబాయి బరిలో దిగారు. ఈమెకు ప్రత్యర్థిగా గిరిధర్‌నాయక్‌కు తెరాస పోటీకి నిలిపింది. ఫలక్‌నుమాలో మొత్తం 19,433 ఓట్లు పోలవ్వగా.. 17,283 ఓట్ల ఆధిక్యంతో తారాబాయి గెలుపొందారు. గత విజేత కూడా ఈమెనే కావడం విశేషం.