ఏపీకి 3 రాజధానుల అంశాన్నిఆ ప్రభుత్వం తెరపైకి తీసుకువచ్చింది. చట్టసభల రాజధానిగా అమరావతి, పాలనాపరంగా విశాఖపట్నం, న్యాయపాలనకు కర్నూలు ఉండొచ్చని శాసనసభలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సూచనప్రాయంగా వెల్లడించారు. మరో నాలుగైదు రోజుల్లోనే రాజధాని సహా రాష్ట్రంలోని కీలక ప్రాజెక్టులపై నిపుణుల కమిటీ నివేదిక ఇవ్వనున్న తరుణంలో.. ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
అమరావతి కట్టాలంటే లక్ష కోట్లు కావాల్సి వస్తుందని ప్రభుత్వం పదేపదే వివిధ వేదికలపై చెబుతోంది. ఇప్పటి వరకు అమరావతి రాజధానిగా కొనసాగుతుందా లేదా అనే సందేహాల నడుమ ఏపీకి మూడు రాజధానులు అసవరమని జగన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనిపై ఇప్పటికే ప్రభుత్వం నియమించిన అధికారిక కమిటీలు నివేదిక ఇచ్చిన తరువాత.. సరైన నిర్ణయం తీసుకుంటామని ఏపీ ప్రభుత్వం చెబుతోంది.
వైకాపా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. రాజధానిగా అమరావతిని కొనసాగిస్తారా లేదా అన్నదానిపై సందేహాలు వ్యక్తమయ్యాయి. పలువురు మంత్రులు వివిధ రకాలుగా వ్యాఖ్యలు చేయడం వల్ల రాజధానిగా అమరావతి భవిష్యత్‌పై అనుమానాలు మొదలయ్యాయి. అయినా.. ప్రభుత్వం దీనిపై ఇన్నాళ్లూ స్పష్టమైన ప్రకటన చేయలేదు. శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి జగన్.. మూడు రాజధానులు అనే మాట తేవడం వల్ల వైకాపా ఆ దిశగా ఆలోచిస్తుందేమోనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.